వరకట్నం అడగడం నేరం కాదు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

క్రూరత్వం, వేధింపులు లేకుండా వరకట్నం అడగడం నేరం కాదని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి ఐపీసీ సెక్షన్ 498A వర్తించదని స్పష్టం చేసింది.

Advertisement
Update:2023-10-18 08:19 IST

వరకట్నం అడగడం, తీసుకోవడం నేరం అని అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాం. వరకట్న దురాచారాన్ని రూపుమాపడానికి ఎంతోమంది సంఘసంస్కర్తలు ఎన్నో ఏళ్ళ పాటు కృషి చేశారు. అయినప్పటికీ వరకట్నమనే జాడ్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వరకట్నం కోసం వేధింపులు, హత్యలు కూడా జరుగుతున్నాయి.

ఒకవేళ వరకట్నం ఇచ్చి పెళ్లి చేసినా అదనపు కట్నం కోసం వేధింపులు జరుగుతున్నాయి. ఈ వేధింపులకు సంబంధించి కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. పరిస్థితులు ఈ విధంగా ఉంటే వరకట్నం అడగడం నేరం కాదు.. అని తాజాగా కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వరకట్న వేధింపులపై నమోదైన కేసును హైకోర్టు విచారిస్తూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. క్రూరత్వం, వేధింపులు లేకుండా వరకట్నం అడగడం నేరం కాదని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ విధంగా కట్నం అడగడం నేరం కాదని.. దీనికి ఐపీసీ సెక్షన్ 498A వర్తించదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

వరకట్నం తీసుకురావాలని భర్త లేదా అతడి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తూ, క్రూరంగా వ్యవహరించినప్పుడు మాత్రమే ఐపీసీ సెక్షన్ 498A వర్తిస్తుందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఇప్పటి యువతలో వరకట్నం తీసుకోవడం అన్నది నేరమనే భావన ఉంది. అలాంటి పరిస్థితి ఉన్న సమయంలో వరకట్నం అడగడం నేరం కాదని కేరళ హైకోర్టు తీర్పు ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.


Tags:    
Advertisement

Similar News