ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఈడీ 10రోజుల రిమాండ్ కోరగా, కోర్టు ఆరు రోజుల రిమాండ్ కి అనుమతిచ్చింది.
ఢిల్లీ సీఎం సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయన ప్రధాన సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. ‘సౌత్ గ్రూప్’ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. ఈడీ 10రోజుల రిమాండ్ కోరగా, కోర్టు ఆరు రోజుల రిమాండ్ కి అనుమతిచ్చింది.
కోర్టుకి వెళ్లే సమయంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. దేశానికి సేవ చేసేందుకు తన జీవితం అంకితం చేశానన్నారాయన. జైలులో ఉన్నా బయట ఉన్నా అది కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ కి రిమాండ్ విధించినా జైలునుంచే పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంలో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేజ్రీవాల్ ని ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం విశేషం.
ఇరు వర్గాల వాదనలు..
నిన్న(గురువారం) రాత్రి 9.05 గంటలకు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశామని ఈడీ కోర్టుకి తెలిపింది. 24 గంటల లోపే కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టామని, 10 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు అందజేసింది. ఆయన అరెస్టుపై బంధువులకు సమాచారం అందించామని కూడా ఈడీ కోర్టుకి తెలిపింది. ఇక కోర్టులో కేజ్రీవాల్ తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. సాక్ష్యాలన్నీ ఉండగా, మళ్లీ కస్టడీ ఎందుకని ప్రశ్నించారు. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టు అవసరం లేదన్నారు. ఈడీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. లిక్కర్ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవని, ఈడీ అధీనంలో ఎలాంటి మెటీరియల్ లేకుండానే, కేజ్రీవాల్‌ను అక్రమంగా, ఏకపక్షంగా అరెస్టు చేశారన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్ కి 6 రోజులు రిమాండ్ విధించింది.