ఈడీ కస్టడీ పొడిగింపు.. రాజకీయ కుట్ర అంటున్న కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ కేసుని రాజకీయ కుట్రగా అభివర్ణించారు కేజ్రీవాల్. కోర్టులోకి వెళ్లే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కుట్రకు ప్రజలే సమాధానం చెబుతారన్నారు.

Advertisement
Update:2024-03-28 18:15 IST

ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీ పొడిగించింది కోర్టు. వారం రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఈడీ అధికారులు ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. మరో వారం రోజులు తమ కస్టడీకి ఆయన్ను అప్పగించాల్సిందిగా కోరారు. అయితే కోర్టు కేవలం నాలుగు రోజులపాటు కస్టడీకి అప్పగించింది. ఏప్రిల్ 1న కేజ్రీవాల్ ను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది.


ఈడీ వాదనలు..

తమ ప్రశ్నలకు కేజ్రీవాల్ సరిగా సమాధానాలు చెప్పడం లేదని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. కేవలం ఐదు రోజులు స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశామని పేర్కొన్నారు. ఆయన సమాధానాలు దాటవేస్తున్నారని ఈడీ ఆరోపించింది. డిజిటల్‌ పరికరాల పాస్‌వర్డ్‌లను ఆయన వెల్లడించలేదని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది.

కేజ్రీవాల్ వాదనలు..

కేజ్రీవాల్ తరపున లాయర్ లేరు, ఆయన తనకు తానే వాదనలు వినిపించారు. ఈ కేసులో తన పేరును నలుగురు సాక్షులు మాత్రమే ప్రస్తావించారని.. ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేసేందుకు ఆ వాంగ్మూలాలు సరిపోతాయా? అని అన్నారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ముద్ర వేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది ఆరోపించారు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు కేజ్రీవాల్. 

రాజకీయ కుట్ర..

ఢిల్లీ లిక్కర్ కేసుని రాజకీయ కుట్రగా అభివర్ణించారు కేజ్రీవాల్. కోర్టులోకి వెళ్లే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కుట్రకు ప్రజలే సమాధానం చెబుతారన్నారు. గతంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఈడీ కేసుని రాజకీయ కుట్రగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. 

Tags:    
Advertisement

Similar News