మేజర్ కాదంటూ నాలుగేళ్ల తర్వాత పెళ్లి రద్దు.. అడ్డుకున్న హైకోర్టు

భార్య మేజర్ కాదన్న విషయం వివాహం జరిగిన తరువాత తెలిసినంత మాత్రాన ఆ వివాహాన్ని రద్దు చేయడం సరికాదని స్పష్టం చేసింది. నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత పెళ్లి రద్దు చేయడం సాధ్యం కాదని తీర్పు చెప్పింది.

Advertisement
Update:2023-01-26 11:13 IST

వివాహ సమయానికి వధువు మేజర్ కాదన్న కారణంతో నాలుగేళ్ల తర్వాత భ‌ర్త పెళ్లి రద్దును కోరాడు. అందుకు ఫ్యామిలీ కోర్టు కూడా సానుకూలంగా స్పందించి తీర్పు చెప్పింది. ఈ కారణంతో పెళ్లిని రద్దు చేయడానికి కర్ణాటక హైకోర్టు మాత్రం తప్పుపట్టింది.

కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన మంజునాథ్- సుశీలకు 2012 జూన్‌ 15న వివాహం జరిగింది. వివాహ సమయానికి ఆమె మేజర్ కాదని, పెళ్లయిన తర్వాత ఆ విషయం తెలిసిందంటూ మంజునాథ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. రికార్డుల ప్రకారం తన భార్య సుశీల 1995 సెప్టెంబర్ ఆరున జన్మించిందని.. ఆ లెక్కన వివాహం జరిగే నాటికి ఆమె వయసు 16 ఏళ్ల 11 నెలలు మాత్రమేనని మంజునాథ్ ఫ్యామిలీ కోర్టులో వాదించారు.

కాబట్టి తమ వివాహాన్ని రద్దు చేయాల్సిందిగా కోరాడు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం ఈ వివాహం చెల్లదంటూ ఫ్యామిలీ కోర్టు కూడా వివాహాన్ని రద్దు చేసింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుశీల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు దిగువ కోర్టు తీర్పును పక్కన పెట్టింది.

భార్య మేజర్ కాదన్న విషయం వివాహం జరిగిన తరువాత తెలిసినంత మాత్రాన ఆ వివాహాన్ని రద్దు చేయడం సరికాదని స్పష్టం చేసింది. నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత పెళ్లి రద్దు చేయడం సాధ్యం కాదని తీర్పు చెప్పింది. ఈ ఆదేశాలు ఇచ్చిన ఫ్యామిలీ కోర్టుపైన హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు కాపురం చేసిన తర్వాత పెళ్లి జరిగిన రోజు ఆమె మేజర్ కాదన్న కారణంతో పెళ్లిని ఎలా రద్దు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. వివాహ రద్దు ఉత్తర్వులను కొట్టివేస్తూ సుశీలకు అనుకూలంగా కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News