కోర్టులో పేటీఎంతో టిప్పు వసూలు.. బిళ్ల బంట్రోతుపై సస్పెన్షన్ వేటు

చాలామంది న్యాయవాదులు చిల్లరలేదు, క్యాష్ తీసుకు రాలేదు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నారట. దీంతో అతను పేటీఎం క్యూఆర్ కోడ్ ని తన యూనిఫామ్ పై అంటించుకున్నాడు. దాన్ని చూపించి స్కాన్ చేయాలని డిమాండ్ చేసేవాడు.

Advertisement
Update:2022-12-02 10:48 IST

నగదు రహిత లావాదేవీలకోసం వాడే పేటీఎంని ఆమ్యామ్యాల వసూళ్ల కోసం ఉపయోగించాడు ఓ బిళ్ల బంట్రోతు. దర్జాగా పేటీఎం క్యూఆర్ కోడ్ ని యూనిఫామ్ పై వేసుకుని తిరిగేవాడు. చిల్లరలేదు అని చెప్పేవారికి క్యూఆర్ కోడ్ చూపించి స్కాన్ చేయాలని డిమాండ్ చేసేవాడు. చివరకు ఈ వ్యవహారం బయటపడి అతను సస్పెండ్ అయ్యాడు.

ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ కోర్ట్ లో రాజేంద్రకుమార్ అనే బిళ్లబంట్రోతు పనిచేస్తుండేవాడు. కోర్టుకి వచ్చే న్యాయవాదులు అతడికి టిప్పు రూపంలో ఎంతోకొంత సమర్పించుకోవాలి. కేసుల సంఖ్యనుబట్టి వారు మామూళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది న్యాయవాదులు చిల్లరలేదు, క్యాష్ తీసుకు రాలేదు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నారట. దీంతో అతను పేటీఎం క్యూఆర్ కోడ్ ని తన యూనిఫామ్ పై అంటించుకున్నాడు. దాన్ని చూపించి స్కాన్ చేయాలని డిమాండ్ చేసేవాడు. ఫోన్ తీసుకు రాలేదు, బ్యాంక్ లో బ్యాలెన్స్ లేదు అని ఎవరూ చెప్పలేరు కాబట్టి, చాలామంది ఆయనకు బుక్కయ్యేవారు. అయితే ఈ ఆమ్యామ్యాల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో న్యాయమూర్తులు రాజేంద్రకుమార్ పై దృష్టిపెట్టారు. విచారణ జరిపించి అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు.

క్యూఆర్ కోడ్ తో దర్జాగా కోర్టులో తిరుగుతున్న రాజేంద్రకుమార్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. న్యాయమూర్తులు కూడా మొదట్లో ఇతడిని పెద్దగా పట్టించుకునేవారు కాదు, కానీ సోషల్ మీడియాలో రాజేంద్రకుమార్ ఫొటో వైరల్ గా మారడంతో బిళ్ల బంట్రోతు వ్యవహారం రచ్చకెక్కింది. దీంతో కోర్టు పరువు పోతోందని న్యాయమూర్తులు జోక్యం చేసుకున్నారు. న్యాయమూర్తి జస్టిస్‌ అజిత్‌ కుమార్‌ ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. దర్యాప్తులో రాజేంద్ర కుమార్‌ బాగోతం బయటపడటంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News