కాంగ్రెస్ లో మళ్ళీ పాతకథే... పార్టీలో పదవులను అధిష్టానమే భర్తీ చేస్తుంది
రాష్ట్ర యూనిట్ చీఫ్‌లు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) సభ్యులను నామినేట్ చేయడానికి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి అధికారమిస్తూ తీర్మానాలు చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం అన్ని రాష్ట్ర యూనిట్లను కోరినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల భర్తీ మళ్ళీ అధిష్టానం నామినేట్ చేయడం ద్వారానే జరగనున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర యూనిట్ చీఫ్‌లు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) సభ్యులను నామినేట్ చేయడానికి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి అధికారమిస్తూ తీర్మానాలు చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం అన్ని రాష్ట్ర యూనిట్లను కోరినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో వచ్చే నెలలో జరగబోయే అంతర్గత ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశ్నార్థకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దానిలో పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రధానాంశం కానుంది. కానీ ఈ తీర్మానాల పరిధిలోకి అధ్యక్ష ఎన్నిక రాకపోవచ్చునని భావిస్తున్నారు.
సోనియా గాంధీ పోటీ చేయరు, కానీ రాహుల్ గాంధీ పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం పార్టీని ఇరకాటంలో పడేసింది. ఈ పరిస్థితుల్లో గాంధీ కుటుంబం దాదాపు 20 సంవత్సరాల తర్వాత గాంధీయేతర వ్యక్తిపై ఆసక్తి చూపడం గమనార్హం. అంటే ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్న సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ వాద్రా కూడా పదవి పై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వంటి విధేయులను గాంధీయేతర ఎంపికలుగా పరిగణిస్తున్నారు. అయినప్పటికీ, రాహుల్ గాంధీ పేరే ప్రముఖంగా వినబడుతోంది. రాహుల్ 2024లో ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపికి వ్యతిరేకంగా పోటీకి సిద్ధపడుతున్నట్టు 'భారత్ జోడో యాత్ర'కి నాయకత్వం వహించడం ద్వారా స్పష్టమవుతోందంటున్నారు.
ప్రస్తుత అధినేత్రి సోనియాగాంధీ తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడిని కూడా ప్రకటించాలని సోనియాగాంధీని కోరుతూ రాష్ట్ర ప్రతినిధులు తీర్మానం చేసేందుకు ఎటువంటి అడ్డంకులు ఉండవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ అది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీకి కట్టుబడి ఉండదు. "మేము ఈ తీర్మానాలను ఆమోదించే ప్రక్రియలో భాగం కాదు" అని ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఒక నాయకుడు చెప్పారు.
ఈ నెల 20లోగా తీర్మానాలు చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమవుతుంది; సెప్టెంబర్ 24 -30 మధ్య నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఓటింగ్ అక్టోబర్ 17 న ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ నేత జితేంద్ర ప్రసాద్ 2000 సంవత్సరంలో సోనియా గాంధీ పై అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె 99 శాతం డెలిగేట్ ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఆయన, ఆయన కుమారుడు జితిన్ ప్రసాద్ కాంగ్రెస్‌లోనే కొనసాగారు. అయితే జితిన్ ప్రసాద్ ఇప్పుడు బిజెపిలో చేరారు. ఓ వైపు గులాంనబీ ఆజాద్ వంటి సీనియర్ నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలంటూ శశిథరూర్,మనీష్ తివారి సహా మరో ఐదుగురు సీనియర్ నేతలు పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ కి లేఖలు రాశారు.
కాగా, ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న 9000 మంది ప్రతినిధుల జాబితా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఈ నెల 20 వ తేదీనుంచి అందుబాటులో ఉంటుందని మిస్త్రీ తెలిపారు. ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగేందుకు వీలుగా ప్రతినిధులకు ప్రత్యేకమైన క్యుఆర్ కోడ్‌లతో కూడిన గుర్తింపు కార్డ్‌లు అందిస్తున్నామని ఆయన తెలిపారు.
పార్టీకి పూర్వ వైభవం తేవాలని రాహుల్ గాంధీ పాద యాత్ర చేస్తున్న సందర్భంలోనే బీజేపీ గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. పాద యాత్ర ద్వారా కాంగ్రెస్ కు పెరుగుతున్న జనాదరణను చూసి బిజెపి తట్టుకోలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.