షెల్ కంపెనీలతో కమీషన్ చెల్లింపులు.. బీమా సంస్థల కొత్త రూట్.. రూ.15 వేల కోట్ల ఐటీ ఎగవేత?
దేశ ప్రజలకు `బీమా` రక్షణ కవచం కల్పిస్తున్న ఇన్సూరెన్స్ సంస్థలు తమ ఆదాయంపై ఐటీ చెల్లింపులకు శఠగోపం పెట్టేందుకు షెల్ కంపెనీలు సృష్టించాయి. తద్వారా రూ.15 వేల కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని దర్యాప్తులో తేలింది.
గతంతో పోలిస్తే ఇన్సూరెన్స్ పాలసీలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే బీమా సంస్థలు పని చేస్తూ వచ్చాయి. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత బీమా రంగంలోకి ప్రైవేట్ సంస్థలు వచ్చేశాయి. బీమా పాలసీ సంబంధిత వ్యక్తుల కుటుంబానికి రక్షణ కవచం వంటిది. తమ బీమా పాలసీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయా బీమా సంస్థలు ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. పాలసీలు చేర్చడాన్ని బట్టి వారికి కమీషన్లు చెల్లిస్తుంటాయి. దేశ ప్రజలకు `బీమా పాలసీల` ద్వారా సెక్యూరిటీ కవరేజీ కల్పిస్తున్న బీమా సంస్థలే `కప్పదాటు` వ్యవహారాలకు పాల్పడుతున్నాయని తేలింది.
దాదాపు 25 ఇన్సూరెన్స్ సంస్థలు.. 250కి పైగా వ్యాపార సంస్థల ద్వారా గతేడాది రూ.15 వేల కోట్లకు పైగా ఆదాయం పన్ను ఎగవేసినట్లు ఆదాయం పన్ను విభాగం దర్యాప్తులో బయట పడింది. ఆయా కంపెనీలు తమ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు కమీషన్లు చెల్లించే విషయంలో అవకతవకలకు పాల్పడ్డాయి. చురుగ్గా ఉండే కమీషన్ ఏజెంట్లు ఎక్కువ బీమా పాలసీలు విక్రయించగలుగుతారు. వారికి చెల్లించే కమీషన్ .. ఆదాయం పన్ను పరిధి దాటితే ఐటీ పే చేయాలి..
ఈ ప్రతిబంధకాన్ని అధిగమించేందుకు బీమా సంస్థలు కొన్ని డొల్ల కంపెనీలు సృష్టించి.. వాటి ద్వారా తమ బీమా ఏజెంట్లకు కమీషన్లు చెల్లించినట్లు వెలుగు చూసింది. బీమా సంస్థలు విక్రయించిన బీమా పాలసీలు.. వాటిపై వచ్చిన జీఎస్టీ తదితర వివరాలను.. సంబంధిత జీఎస్టీ అధికారులు గతేడాది ఆదాయం పన్ను విభాగానికి అందజేశారు. జీఎస్టీ అధికారులు సమర్పించిన వివరాలు అసెసింగ్ అధికారులు (ఏఓ) అధ్యయనం చేసిన తర్వాత సంబంధిత బీమా సంస్థల నుంచి పెనాల్టీ, వడ్డీతోపాటు పన్ను వసూలు చేయాలని నిర్ణయించినట్లు ఐటీ విభాగం రూపొందించిన నివేదిక తెలిపింది.
ఆదాయం పన్ను విభాగంతోపాటు జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ (డీజీజీఐ) అధికారులు కూడా దర్యాప్తులో పాల్గొన్నారు. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నిబంధనలను ఉల్లంఘించి మరీ బీమా సంస్థలు.. పేక్ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లయిమ్‌లు సమర్పించారని ఆ నివేదిక సారాంశం.
నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ దాఖలు చేసిన ప్రైవేట్ బీమా సంస్థల నివేదికపై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత వాటికి షోకాజ్ నోటీసులు పంపుతామని జీఎస్టీ అధికారులు తెలిపారు. కానీ ప్రైవేట్ బీమా సంస్థల వాదన మరోలా ఉంది.. తమ మార్కెటింగ్, సేల్స్ ఖర్చులను ఏజెంట్లకు కమీషన్లు చెల్లించినట్లు జీఎస్టీ అధికారులు తప్పుగా భావిస్తున్నారని ఆయా బీమా సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు.
బజాజ్ అలియాంజ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలతోపాటు 15 బీమా సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రభుత్వ రంగ బీమా సంస్థలు సైతం రూ.2350 కోట్ల జీఎస్టీ ఎగవేసినట్లు ఒక ఆంగ్ల దినపత్రికలో వార్త ప్రచురితమైంది.