కర్ణాటకలో బీజేపీ కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందా?
బీజేపీ ఎంపీ గోవింద్ కర్జోల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసహనం పెల్లుబుకుతోందంటూ గోవింద్ కర్జోల్ చేసిన వ్యాఖ్యల్లో నిజముందని బసవరాజ్ బొమ్మై చెప్పారు.
తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలు చేయడంలో దిట్ట అయిన బీజేపీ.. కర్ణాటకలోనూ ఆ తరహా రాజకీయాలకు తెరతీస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మై చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చేలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర రాజకీయాలపై ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, చివరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలే అధిష్ఠానంపైకి తిరగబడే పరిస్థితులు తలెత్తాయని చెప్పారు.
దావణగిరెలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను నిధుల కొరత వెంటాడుతోందని, ప్రజల ముందుకు వెళ్లాలంటేనే వాళ్లు భయపడుతున్నారని చెప్పారు. పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్న ఆయన.. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే, రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉందా? లేదా? అనే సందేహం కలుగుతుందని చెప్పారు.
ఇటీవల బీజేపీ ఎంపీ గోవింద్ కర్జోల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసహనం పెల్లుబుకుతోందంటూ గోవింద్ కర్జోల్ చేసిన వ్యాఖ్యల్లో నిజముందని బసవరాజ్ బొమ్మై చెప్పారు. బీజేపీలో ఆయన సీనియర్ నేత అని, చాలా ఏళ్ల రాజకీయ అనుభవముందని చెప్పుకొచ్చారు. ఆయన అసత్య ఆరోపణలు చేయలేదని, పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే మాట్లాడారని తెలిపారు.
అంతకుముందు దావణగిరె బీజేపీ కార్యాలయంలో బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు అమాంతం పెంచేస్తూ.. పేద, సామాన్య ప్రజలపై తలకు మించిన భారం మోపుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ తదితర ధరలను పెంచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయిందన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం సిద్ధరామయ్య తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యల తీరును గమనిస్తే.. బీజేపీ కర్ణాటక రాజకీయాల్లో కుట్రలకు తెరలేపుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.