కరోనా తర్వాత దుబాయ్ కి క్యూ కట్టిన భారత పర్యాటకులు..
ఈ ఏడాది 9నెలల కాలంలో 68 లక్షల మంది పర్యాటకులు దుబాయ్ ని సందర్శించినట్టు దుబాయ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకానమి అండ్ టూరిజం సంస్థ పేర్కొంది. ఇందులో భారత టూరిస్ట్ ల సంఖ్య 12లక్షలు.
కరోనా తర్వాత పరిస్థితులన్నీ చక్కబడినట్టు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ప్రయాణాలు స్పీడందుకుంటున్నాయి. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేసేవారు విహార యాత్రలకు ఏమాత్రం ఆలోచించడంలేదు. అందులోనూ ప్రస్తుతం భారతీయులు దుబాయ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు భారత్ నుంచి దుబాయ్ పయనమయ్యారు.
దుబాయ్ అంటే ఎందుకంత క్రేజ్..
సరదాగా టూర్ వేద్దామనుకుంటున్న ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ముందుగా ఇండియాలో ప్రముఖ ప్రాంతాలను చూడాలనుకుంటుంది. కానీ కాస్త ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే దుబాయ్ చుట్టి రావచ్చు అనేది ఇప్పుడు అందరిలో బలంగా నాటుకుపోయింది. విదేశీ ప్రయాణం చేసిన ఫీలింగ్, ఒకేసారి విమానం, బోట్, రుచికరమైన వంటలు, ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడొచ్చు. అందులోనూ అత్యంత భద్రమైన ప్రాంతంగా దుబాయ్ కి పేరు రావడంతో భారతీయులు ఎక్కువగా అక్కడికే క్యూ కడుతున్నారు. గతేడాది తొలి అర్థభాగంలో దాదాపుగా 4లక్షలమంది దుబాయ్ కి వెళ్లొచ్చారు. ఈ ఏడాది తొలి అర్థభాగంలో 8.58 లక్షలమంది భారత పర్యాటకులు దుబాయ్ చుట్టొచ్చారు. అంటే ఏడాదిలోనే ఈ సంఖ్య రెట్టింపైందనమాట.
కరోనా ముందు పరిస్థితులు రిపీట్ అయ్యేనా..?
కరోనాకి ముందు 2019లో కోటీ 67లక్షలమంది పర్యాటకులు దుబాయ్ ని సందర్శించారు. ఈ ఏడాది 9నెలల కాలంలో 68 లక్షల మంది పర్యాటకులు దుబాయ్ ని సందర్శించినట్టు దుబాయ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకానమి అండ్ టూరిజం సంస్థ పేర్కొంది. ఇందులో భారత టూరిస్ట్ ల సంఖ్య 12లక్షలు. కరోనాకి పూర్వం ఉన్న పరిస్థితులు తిరిగి రావాలంటే మరికొంత కాలం పడుతుంది. అయితే కరోనా తర్వాత ఈ స్థాయిలో తిరిగి పర్యాటక రంగం పుంజుకుంటుందని ఏ దేశం కూడా అంచనా వేయలేదు. ఆ అంచనాలకు మించి ఇప్పుడు పర్యాటకులు విదేశాలకు పయనమవుతున్నారు. కరోనా నేర్పిన పాఠంతో అనుభవించు రాజా అనే పాట పాడేసుకుంటున్నారు.