75 శాతం భారతీయ యువతకు ఈ మెయిల్ పంప‌డం కూడా సరిగా రాదు ...రిపోర్ట్

భారతదేశం ప్రపంచానికి IT హబ్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ వాస్తవానికి జనాభాలో ఎక్కువ శాతం మందికి కంప్యూటర్ పైనే ఇప్పటికీ సరైన అవగాహన లేదు.కేవలం 20 శాతం మంది మాత్రమే సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం,కాన్ఫిగర్ చేయడం వంటివి చేయగలమని చెప్పారు.

Advertisement
Update:2023-03-30 12:00 IST

భారతదేశం 2025 నాటికి ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీగా మారాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. అయితే ఇప్పటికీ చాలా మంది యువ భారతీయులకు ఈ-మెయిల్ అటాచ్‌మెంట్‌ను ఎలా పంపాలో కూడా తెలియదు. ప్రాథమిక కంప్యూటర్ ఫంక్షన్ లు కూడా తెలియదని నేషనల్ శాంపుల్ సర్వే (NSSO) విడుదల చేసిన మల్టిపుల్ ఇండికేటర్ సర్వే (MIS) తాజా నివేదిక తెలిపింది.

2020-21లో దేశవ్యాప్తంగా 11 లక్షల మంది యువతీ యువకులతో NSSO ఈ సర్వే నిర్వహించింది.

15-29 మధ్య వయస్సు గల వ్యక్తుల ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) నైపుణ్యాలను పరీక్షించడానికి ఈ సర్వే జరిగింది. కంప్యూటర్‌లో తొమ్మిది రకాల కార్యకలాపాలను నిర్వహించగలరా లేదా అని వార్ని ప్రశ్నించారు.

ప్రశ్నలకు ప్రతిస్పందనగా, చాలా మంది కంప్యూటర్ కు సంబంధించిన‌ సాధారణ పనులను కూడా చేయలేకపోయారు. కేవలం 27 శాతం మంది మాత్రమే అటాచ్‌మెంట్‌లతో ఇ-మెయిల్ ఎలా పంపాలో తమకు తెలుసని చెప్పారు. 10 శాతం మంది మాత్రమే స్ప్రెడ్‌షీట్‌లో ప్రాథమిక అంకగణిత సూత్రాలను ఉపయోగించవచ్చని చెప్పారు. కేవలం 9 శాతం మంది మాత్రమే ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్‌ను రూపొందించవచ్చని చెప్పారు.97 శాతం మంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను ఎలా వ్రాయాలో తమకు తెలియదని చెప్పారు.

భారతదేశం ప్రపంచానికి IT హబ్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ వాస్తవానికి జనాభాలో ఎక్కువ శాతం మందికి కంప్యూటర్ పైనే ఇప్పటికీ సరైన అవగాహన లేదు.కేవలం 20 శాతం మంది మాత్రమే సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం,కాన్ఫిగర్ చేయడం వంటివి చేయగలమని చెప్పారు. కేవలం 12 శాతం మంది మాత్రమే ప్రింటర్ లేదా కెమెరా వంటి కొత్త పరికరాన్ని కనెక్ట్ చేసి ఇన్‌స్టాల్ చేయగలరని పేర్కొన్నారు.

15-29 వయస్సు గల వారు భారతదేశ జనాభాలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ. పని చేసే వయస్సులో ఉన్న ఈ యువ జనాభాలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT ) నైపుణ్యాలు లేకపోవడం వల్ల‌ పెరుగుతున్న డిజిటలైజ్డ్ ప్రపంచంలో వారిలో చాలా మంది భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

కాగా, ఈ సర్వేలో కొన్ని ఆశ్చర్యకరమైన వైవిధ్యాలు కూడా ఉన్నట్టు తేలాయి. దక్షిణ భారతదేశంలో యువత ఉత్తరాది రాష్ట్రాల్లో యువతకన్నా ఈ రంగంలో ముందున్నారు. అలాగే పట్టణ యువత గ్రామీణ యువతకన్నా ముందున్నారు. 

Tags:    
Advertisement

Similar News