రష్యాలో జాతిపిత మహాత్మా గాంధీకి ఘోర అవమానం
రష్యా బీర్లు తయారు చేసే కంపెనీ ఏకంగా బీర్ టిన్లపై గాంధీ ఫొటోలు ముద్రించి విక్రయిస్తోంది.
జాతిపిత మహాత్మా గాంధీకి రష్యాలో ఘోర అవమానం జరిగింది. ఆ దేశంలో బీర్లు తయారు చేసే కంపెనీ ఏకంగా బీర్ టిన్లపై గాంధీ ఫొటోలు ముద్రించి విక్రయిస్తోంది. అది కూడా మహాత్ముడి పేరు, సంతకంతో సహా ముద్రించి బీర్ టిన్లను సదరు రష్యన్ బేవరేజ్ సంస్థ అమ్ముతోంది. రష్యాకు చెందిన రివోర్ట్స్ అనే కంపెనీ హాజీ ఐపీఏ పేరుతో ఇలా బీర్ టిన్లను అమ్ముతుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
దీనిపై ఇండియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ జాతిపిత అయిన గొప్ప నాయకుడిని ఇలా అవమానించేలా ఆయన ఫొటోను బీర్ టిన్లపై ముద్రించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీవితాంతం శాఖాహారిగా.. మద్యపానం ముట్టని వ్యక్తిగా ఉన్న గాంధీజీ ఫొటోను బీర్ టిన్లపై ఎలా ముద్రిస్తారంటూ నెటిజన్లు కూడా ఆ ఫోటోలు, వీడియోలపై మండిపడ్డుతున్నారు. రివోర్ట్స్ కంపెనీ కేవలం గాంధీజీ ఫొటోలతోనే కాకుండా నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ థెరిస్సా వంటి ప్రముఖ నాయకుల పేర్లు, ఫొటోలతో బీర్లు తయారు చేసి, విక్రయిస్తున్నట్లు సమాచారం.