రుతుపవనాలు వచ్చేశాయ్... తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఎప్పుడంటే!
తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు 5 నుంచి 7 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ.
భారత వాతావరణ శాఖ- IMD గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని ధృవీకరించింది. సాధారణం కంటే రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని IMD ప్రకటించింది. సాధారణంగా జూన్ ఒకటిన కేరళలో ప్రవేశిస్తాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా మారడంతో ముందుగానే రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయని స్పష్టం చేసింది.
ఇక కేరళతో పాటు ఈశాన్య భారత రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. రెమాల్ తుపాన్ ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలకు వేగంగా నైరుతి విస్తరించిందని చెప్పింది. నైరుతి రుతుపవనాల ఎంట్రీతో కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలను అలర్ట్ చేసింది ఐఎండీ.
కేరళ, దక్షిణ కర్ణాటకతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు 5 నుంచి 7 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ. మన దేశంలోని వ్యవసాయం ప్రధానంగా నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది.