రాహుల్ గాంధీ కులం తెలియాలంటే దేశంలో కుల గణన చేపట్టండి
కార్యకర్తల సమస్యల పరిష్కారానికే మంత్రుల ముఖాముఖి : మంత్రి కొండా సురేఖ
రాహుల్ గాంధీ కులం తెలియాలంటే దేశంలో కుల గణన చేపట్టాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ కుల వివక్ష లేదని, ఒక్క భారతదేశంలోనే ఉన్న ఈ వివక్ష పోగొట్టడానికే కులగణన చేస్తున్నామని మంత్రి తెలిపారు. బుధవారం గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలు, కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ, గతంలో మంత్రులకే అపాయింట్‌మెంట్ దొరికేది కాదని, కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తల సమస్యలు పరిష్కరించేందుకే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. రాహుల్ గాంధీ కులంతో బీజేపీ నాయకులకు ఏం పని అని ప్రశ్నించారు. కుల గణనతో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలవాలని రాహుల్ గాంధీ సంకల్పించారన్నారు. బీజేపీకి మతతత్వ రాజకీయాలు చేయడమే పని అన్నారు. ఆ పార్టీ కొన్ని వర్గాలకే న్యాయం చేసిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, అటవీ భూములపై హక్కులు, ఆరోగ్య, భూ సంబంధిత సమస్యలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ పలువురు వినతిపత్రాలు సమర్పించారు. మంత్రి సురేఖ ఆయా అర్జీలపై అధికారులకు ఫోన్లు చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.