బీజేపీ పాటించే హిందుత్వం ఓట్ల కోసం మాత్రమే

ఒక్క ఫోన్‌ కాల్‌తో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రధాని .. బంగ్లాదేశ్‌లో హింసను మాత్రం ఆపలేరా? అని నిలదీసిన ఉద్ధవ్‌

Advertisement
Update:2024-12-13 15:51 IST

బంగ్లాదేశ్‌లోని హిందువుల రక్షణ కోసం భారత్‌ తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని పార్లమెంటుకు తెలియజేయాలని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కోరారు. ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పాటించే హిందుత్వం ఓట్ల కోసం మాత్రమేనని మండిపడ్డారు. బంగ్లాదేశ్‌లో హిందువులు అణిచివేతకు గురవుతున్నారు. ఇస్కాన్‌ కార్యాలయాలను తగలబెట్టారు. అయినా ప్రధాని మోడీ మౌనంగానే ఉన్నారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రధాని .. బంగ్లాదేశ్‌లో హింసను మాత్రం ఆపలేరా? అని ఉద్ధవ్‌ నిలదీశారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘటనలకు వ్యతిరేకంగా నిలబడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరి తరఫున మోదీని అభ్యర్థిస్తున్నాని ఆయన పేర్కొన్నారు.

ఐక్యత గురించి మన దేశంలో ప్రసంగాలు చేయడంతో ఉపయోగం లేదని.. భారతీయులను హింసకు గురి చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ ప్రపంచ దేశాలను చుట్టివచ్చే కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయనకు ఎంపీలను కలిసే సమయంలోనూ ఉండటం లేదని సెటైర్‌ వేశారు. మోడీ తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్తుండటం వల్ల ఆయనకు మణిపూర్‌ అల్లర్లు, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింస గురించి తెలిసి ఉండకపోవచ్చన్నారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌లో సురక్షితంగా ఉన్నారని.. మరి ఆ దేశంలో కష్టాలు పడుతున్న హిందువుల సంగతి ఏంటి? అని ప్రధానిని ప్రశ్నించారు. 

Tags:    
Advertisement

Similar News