ఇంగ్లిష్ పదాలతో హిందీ ఎంబీబీఎస్ పుస్తకాలు.. నేడే విడుదల..
హిందీ మీడియం పుస్తకాలను ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారికంగా విడుదల చేస్తారు. హిందీ భాషలో ఎంబీబీఎస్ బోధించే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రికార్డులకెక్కబోతోంది.
థర్మా మీటర్ ని హిందీలో ఏమంటారు.. ?
స్టెతస్కోప్ ని ఏ పేరుతో పిలుస్తారు.. ?
యోంజియోగ్రామ్, యాంజియో ప్లాస్టీ.. వీటన్నిటికీ సమానమైన హిందీ పదాలు ఏంటి.. ? దీనిపై ఇప్పటి వరకూ చాలా రీసెర్చ్ చేసి. ఇలాంటి పదాలను హిందీలోకి తర్జుమా చేయలేమని చేతులెత్తేశారు నిపుణులు. అయినా కేంద్రం ఊరుకుంటుందా.. తమ పంతం నెగ్గించుకుంది. సాంకేతిక పదాలను ఇంగ్లిష్ లోనే ఉంచుతూ హిందీ ఎంబీబీఎస్ పుస్తకాలు తయారు చేయించింది. హిందీ మీడియం పుస్తకాలను ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారికంగా విడుదల చేస్తారు. హిందీ భాషలో ఎంబీబీఎస్ బోధించే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రికార్డులకెక్కబోతోంది.
పైత్యంతో మొదలై, అహంకారంగా మారి..
ప్రాథమిక, మాధ్యమిక విద్య స్థానిక భాషల్లోనే ఉంటుంది. సాంకేతిక విద్య, ఉన్నత విద్య దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ మీడియంలోనే ఎక్కువగా సాగుతోంది. ఐఐటీ, ఐఐఎం లలో స్థానిక భాషల్లో బోధన జరుపుతామంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులకు చాలా కష్టం. కానీ బీజేపీకి ఓ పైత్యం మొదలైంది. ఆ పైత్యాన్ని అన్ని రాష్ట్రాలపై రుద్దాలనుకుంది. దీనికోసం ఏకంగా పార్లమెంటరీ కమిటీని నియమించారు. దానికి అమిత్ షా అధ్యక్షుడు కావడంతో ఏకపక్షంగా హిందీ మీడియం రుద్దేందుకు ఓ నివేదిక రెడీ చేశారు. ఆ నివేదిక బయటపడిన రోజుల వ్యవధిలోనే మధ్యప్రదేశ్ లో హిందీ మీడియం ఎంబీబీఎస్ పుస్తకాలు విడుదల చేయాలనుకోవడం గమనార్హం. ఇతర రాష్ట్రాలపై కూడా దీన్ని రుద్దాలనుకోవడం అహంకార పూరిత నిర్ణయం అని దక్షిణాది రాష్ట్రాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందుకే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ నుంచి ఈ పైత్యం మొదలు పెట్టబోతున్నారు.
హిందీలో వైద్య విద్య బోధనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదవబోయే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు హిందీలోనే బోధన మొదలు పెడతామని చెప్పారు. అటానమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పాఠాలు హిందీలో చెప్పడానికి సిలబస్ ఖరారు చేశారు. హిందీలోకి అనువదించిన పాఠ్యపుస్తకాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు విడుదల చేస్తారు. మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులను హిందీలో నేర్చుకోలేమని, బోధించలేమనే భావనను రూపుమాపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
మీడియం మార్చి ఉపయోగం ఏంటి.. ?
పుస్తకాల అనువాదం కోసం భోపాల్ లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో హిందీ సెల్ ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీలకు చెందిన 97 మంది ప్రొఫెసర్లు ఈ అనువాదాన్ని పూర్తి చేశారు. అయితే ఇంగ్లిష్ పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. హిందీమీడియం పుస్తకాల్లో కూడా సాంకేతిక పదాలు ఇంగ్లిష్ లోనే ఉంటాయని ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ స్పష్టం చేశారు. అంటే మీడియం హిందీ అయినా, సాంకేతిక పదాలు మాత్రం ఇంగ్లిష్ లోనే చదువుకోవాలన్నమాట. మరి దీనికోసం హిందీ మీడియం పుస్తకాలు, ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకో కేంద్రమే చెప్పాలి.