జార్ఖండ్ గవర్నర్ తో హేమంత్ సోరేన్ భేటీ
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హేమంత్ సోరేన్ ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ గంగ్వార్ ను కోరారు. ఆదివారం మధ్యాహ్నం సమావేశమైన ఇండియా కూటమి పార్టీలు తమ కూటమి పక్షనేతగా హేమంత్ సోరేన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. సమావేశం అనంతరం హేమంత్ సోరేన్ భాగస్వామ్యపక్షాల నాయకులతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ గంగ్వార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం కూటమి పార్టీల మద్దతు లేఖలను అందజేసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. హేమంత్ సోరేన్ ఈనెల 28న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలుండగా ఇండియా కూటమిలోని జేఎఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ (ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ 21 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో హేమంత్ సోరేన్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈడీ కేసులో తనను అరెస్ట్ చేయడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో పార్టీ సీనియర్ నేత చంపయీ సోరేన్ కు సీఎంగా అవకాశం ఇచ్చారు. హేమంత్ జైల్ లో ఉన్న సమయంలో ఆయన సతీమణి కల్పన సోరేన్ పార్టీని ఒంటిచేత్తో నడిపించారు. హేమంత్ బెయిల్ పై విడుదలయ్యాక మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత చంపయీ సోరేన్ పార్టీతో విభేదించి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఐదేళ్ల వ్యవధిలోనే ముచ్చటగా మూడోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.