అమ్మాయి బర్త్ డే పార్టీకి భారీగా పోలీసులు.. అసలేమైందంటే..

ఎస్‌హెచ్వో రాజ్ కుమార్ ఆ ఇంటి లోపలికి వెళ్లి ఆరా తీయగా.. ఆ ఇంట్లో ఒక అమ్మాయి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నట్లు తెలిసింది. బయటకు వచ్చిన ఆయన మిగతా పోలీసులకు కూడా విషయాన్ని తెలిపారు.

Advertisement
Update:2024-05-27 18:50 IST

ఆదివారం అర్ధరాత్రి.. ఓ ఇంట్లో అమ్మాయి బర్త్‌డే పార్టీ జరుగుతోంది. ఇరుగుపొరుగువారు, తెలిసిన వారు మాత్రమే ఆ వేడుకలో ఉన్నారు. ఆ వేడుకకు ఉన్నట్టుండి భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు.. అంతమంది ఒకేసారి రావడంతో అసలేం జరిగిందో అని ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కంగారు పడొద్దని చెప్పిన పోలీసులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఔరయ్య జిల్లా అజిత్మల్ కొత్వాలి పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి పోలీసుల బృందం పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఆ సమయంలో ఓ ఇంటి వద్ద జనాలు గుమిగూడి ఉండటం.. వాహనాలు కూడా చాలా సంఖ్యలో ఉండడంతో పోలీసులు ఆ ఇంటి వద్దకు వచ్చారు.

ఎస్‌హెచ్వో రాజ్ కుమార్ ఆ ఇంటి లోపలికి వెళ్లి ఆరా తీయగా.. ఆ ఇంట్లో ఒక అమ్మాయి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నట్లు తెలిసింది. బయటకు వచ్చిన ఆయన మిగతా పోలీసులకు కూడా విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత ఆ పోలీసులంతా బర్త్ డే వేడుకలు జరుగుతున్న ఇంట్లోకి వెళ్లారు.

ఒక్కసారిగా ఇంట్లోకి అంతమంది పోలీసులు రావడంతో ఏం జరిగిందో తెలియక ఆ ఇంట్లోని వారు భయపడ్డారు. దీంతో పోలీసులు కలగజేసుకొని పెట్రోలింగ్ కోసం ఇటువైపు వచ్చామని.. కంగారు పడవద్దని సూచించారు. అనంతరం ఎస్‌హెచ్వో మరో కేక్ ను ఆర్డర్ పెట్టి తెప్పించారు. పోలీసులందరూ కలిసి అమ్మాయితో కేక్ కట్ చేయించారు. ఇన్ స్పెక్టర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడంపై ఆ ఇంటి వారు స్పందిస్తూ.. పోలీసుల తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంట్లోకి రాగానే ముందు భయమేసినప్పటికీ ఆ తర్వాత వారి తీరు చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. అజిత్మల్ పోలీసులు తమ విధులను కాసేపు పక్కన పెట్టి సాధారణ పౌరులతో మమేకం కావడంపై ప్రశంసలు వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News