న్యాయంపట్ల నమ్మకం పోయింది.. బిల్కిస్ బానో ఆవేదన
బిల్కీస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం చేసి ఏడుగురిని హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్ ప్రభుత్వ విడుదల చేయడం పట్ల బిల్కీస్ బానో ఆందోళన వ్యక్తం చేసింది. తనకు న్యాయంపై నమ్మకం పోయిందని ఆమె వ్యాఖ్యానించింది.
గోద్రా జైలు నుంచి 11 మంది రేపిస్టుల విడుదల ... న్యాయం పట్ల తన నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టిందని బాధితురాలు బిల్కిస్ బానో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిణామం తనను ఎంతగానో కలచివేసిందని, తన బాధను చెప్పుకోవడానికి కూడా మాటలు రావడంలేదని వాపోయింది. గుజరాత్ లో గోద్రా జైలు నుంచి 11 మంది రేపిస్టులను ప్రభుత్వం రెండు రోజుల క్రితం రిలీజ్ చేసింది. 2002 లో గోధ్రా అల్లర్ల తరువాత కొందరు ప్రతీకారంగా బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్ కి పాల్పడి.. ఆమె కుటుంబంలోని ఏడుగురిని హతమార్చారు. నాటి ఈ ఘటనలో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు .. వీరిలో ఆరుగురు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా బయటపడ్డారు. మిగిలిన 11 మందికి యావజ్జీవ శిక్ష పడింది. అయితే గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి వీరిని విడుదల చేసింది.
దీనిపై మొదటిసారిగా స్పందించిన బాధితురాలు బిల్కిస్ బానో.. తాను ఈ దేశంలోని కోర్టులను ఎంతో నమ్మానని, జుడీషియరీ పట్ల విశ్వాసంతో ఉన్నానని, జరిగిన ఘటనల నుంచి మెల్లగా కోలుకుని.. ఆ క్షోభ నుంచి బయటపడ్డానని తెలిపింది. నా బాధ, కేవలం నాది మాత్రమే కాదు.. కోర్టుల్లో న్యాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి బాధితురాలిది.. కానీ 11 మంది రేపిస్టుల విడుదల నన్ను కలచివేస్తోంది అని ఆమె తెలిపింది. 18 ఏళ్లుగా న్యాయపోరాటం చేశానని బానో దాదాపు కన్నీటి పర్యంతమైంది. ఈ నిందితులను విడుదల చేసేముందు ప్రభుత్వం కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. నా భద్రత గురించి ఆలోచించలేదు.. ఇంత పెద్ద అన్యాయపు నిర్ణయాన్ని తీసేసుకుంది అని అని ఆమె చెప్పింది. నిర్భయంగా జీవించే హక్కును మళ్ళీ తనకివ్వాలని, తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించే వెసులుబాటునివ్వాలని బిల్కిస్ బానో ప్రభుత్వాన్ని కోరింది. జైలు నుంచి 11 మంది రేపిస్టుల విడుదలతో తన క్లయింటు ఆందోళనగా ఉందని, వాళ్ళు జైల్లో శిక్ష అనుభవిస్తున్నంత కాలం.. ఇన్నేళ్ళు.. ఎక్కడో ఒకచోట దాక్కున్నట్టు ప్రశాంతంగా బతికిందని బానో లాయర్ శోభా గుప్తా అన్నారు. కానీ ఇప్పుడు తన భవిష్యత్తుపై తీవ్ర కలవరం చెందుతోందని ఆమె చెప్పారు.
జైలు నుంచి ఈ నిందితుల విడుదలపై విపక్షాలు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. గుజరాత్ ప్రభుత్వం తన క్షమాభిక్ష ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఇలాంటి రేపిస్టులకు బెయిల్ లభించకుండా చట్టాలకు సవరణ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎంఐ ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ వంటివారెందరో కేంద్రాన్ని కోరారు. ఆర్జేడీ కూడా ప్రభుత్వ చర్యను ఖండించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశించినట్టు 1992 నాటి తమ పాలసీ ప్రకారం ఈ 11 మంది నిందితుల విడుదలపై తాము సరైన నిర్ణయమే తీసుకున్నామని గుజరాత్ సర్కార్ తన చర్యను సమర్థించుకుంది. నిజానికి రేపిస్టులను రిలీజ్ చేయరాదని కేంద్రం ఆదేశించినప్పటికీ .. తమ పాలసీ ప్రకారం వీరిని రిలీజ్ చేసినట్టు గుజరాత్ హోమ్ కార్యదర్శి రాజ్ కుమార్ చెప్పారు.