ఉగ్రదాడిలో నలుగురు జవాన్ల మృతి

నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఇది రెండో ఉగ్రదాడి కావడం గమనార్హం. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు సైన్యంపై దాడికి ఈ ప్రాంతాన్ని ఎంచుకొంటున్నారు.

Advertisement
Update:2023-12-22 09:04 IST

ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ–కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో గురువారం మధ్యాహ్నం 3:40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. జవాన్లు ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఈ దాడి చేశారు. ఈ ఘటనలో మరో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారని సైనిక అధికారులు వెల్లడించారు.

పూంచ్‌ జిల్లాలోని బుఫియాజ్‌ సమీపంలో బుధవారం రాత్రి నుంచి ఉగ్రవాదుల కోసం వేట సాగుతోంది. ఈ క్రమంలోనే రెండు వాహనాల్లో జవాన్లు ఆ ప్రదేశానికి బయల్దేరారు. రాజౌరీ– ఠాణామండీ– సురన్‌ కోటే రహదారిపై సావ్ని ప్రాంతానికి చేరుకోగానే.. ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో వెంటనే తేరుకున్న జవాన్లు సైతం ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అదనపు బలగాలతో పాటు అంబులెన్సులను తరలించినట్లు అధికారులు తెలిపారు.

నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఇది రెండో ఉగ్రదాడి కావడం గమనార్హం. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు సైన్యంపై దాడికి ఈ ప్రాంతాన్ని ఎంచుకొంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ–పూంచ్‌ ప్రాంతంలో జరిగిన జంట దాడుల్లోనూ 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో రాజౌరీలోని కలాకోట్‌లో జరిగిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. గత రెండేళ్ల కాలంలో జరిగిన దాడుల్లో మొత్తం 35 మంది సైనికులు మృతిచెందడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News