రష్యాలో విషాదం.. నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం
సెయింట్స్ పీటర్స్‌బర్గ్‌లోని యరోస్లోవ్ ది వైస్ నోవొగొరోడ్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులు కొందరు ఈనెల 5న తమకు సమీపంలోని వోల్ఖోవ్ నది ఒడ్డున వాకింగ్‌కు వెళ్లారు.
వైద్య విద్య కోసం రష్యా వెళ్లిన భారతీయ విద్యార్థుల విషాదాంతమిది. సరదాగా విహారానికి వెళ్లిన నలుగురు విద్యార్థులు నదిలో మునిగి చనిపోయిన దారుణమిది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. మృతులు మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాకు చెందిన హర్షల్ అనంత్‌రావ్, జీషన్ పింజారీ, జియా పింజారీగా గుర్తించారు. వీరితోపాటు మాలిక్ మహ్మద్ యాకూబ్ అనే మరో భారతీయ విద్యార్థి కూడా దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
నది ఒడ్డున వాకింగ్ చేస్తూ జారిపడి..
సెయింట్స్ పీటర్స్‌బర్గ్‌లోని యరోస్లోవ్ ది వైస్ నోవొగొరోడ్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులు కొందరు ఈనెల 5న తమకు సమీపంలోని వోల్ఖోవ్ నది ఒడ్డున వాకింగ్‌కు వెళ్లారు. వాకింగ్ చేస్తుండగా ఓ విద్యార్థి జారి నదిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు సహచర విద్యార్థులు నలుగురు నదిలోకి దిగారు. వీరిలో నలుగురు చనిపోగా, ఓ అమ్మాయిని స్థానికులు కాపాడారు.
ఘటనను ధ్రువీకరించిన జల్‌గావ్ కలెక్టర్
మృతుల స్వస్థలమైన జల్‌గావ్ కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ ప్రమాద ఘటనను ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన తమ జిల్లావాసుల మృతదేహాలను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన మీడియాకు చెప్పారు. ఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సెయింట్ పీటర్స్‌బర్గ్ ప్రభుత్వం ప్రకటించింది.