హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
స్వామినాథన్ సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు ఆయనను వరించాయి. 1987లో ఫస్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను స్వామినాథన్ అందుకున్నారు. దేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం ఆయనను గౌరవించింది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడిగా పేరుపొందిన ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన స్వామినాథన్..98 ఏళ్ల వయస్సులో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. ఇది భారతదేశంలోని చిన్న, సన్నకారు రైతులు పెద్దఎత్తున దిగుబడులు సాధించేందుకు ఉపయోగపడింది. ఇండియాను ఆహారం ఉత్పత్తుల ఎగుమతుల దేశంగా మార్చడంలోనూ ఆయన కృషి మరువలేనిది.
ఆయన జీవిత కాలంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1961-72 మధ్య ది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1972-79 మధ్య ICAR డైరెక్టర్ జనరల్‌గా, భారత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ సేవలందించారు. 1979-80 కాలంలో అగ్రికల్చర్ మినిస్ట్రి ప్రిన్సిపల్ సెక్రటరీగానూ పని చేశారు. 1980-82 మధ్య కాలంలో ప్రణాళిక సంఘంలోనూ సభ్యుడిగా కొనసాగారు. ఇక 1982-88 మధ్య ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గానూ వ్యవహరించారు.
2004లో జాతీయ రైతు కమిషన్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు ఎంఎస్ స్వామినాథన్. రైతు ఆత్మహత్యలు, కష్టాలపై అధ్యయనం చేయడానికి అప్పటి ప్రభుత్వం స్వామినాథన్ నేతృత్వంలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2006లో తన రిపోర్టును సమర్పించింది. కనీస మద్దతు ధర-MSP.. ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం ఎక్కువగా ఉండాలని ఈ కమిటీ సూచించింది. అయితే ఇప్పటివరకూ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుకు నోచుకోలేదు.
స్వామినాథన్ సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు ఆయనను వరించాయి. 1987లో ఫస్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను స్వామినాథన్ అందుకున్నారు. దేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం ఆయనను గౌరవించింది. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1986లో అల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు సహా అనేక అంతర్జాతీయ అవార్డులుఆయన సొంతమయ్యాయి.
♦