టీఎంసీ ఎంపీ మహువాకు షాక్‌.. బహిష్కరణ తప్పదా?

ఎథిక్స్ కమిటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా.. ఆరుగురు సభ్యులు మహువాను బహిష్కరించాలన్న ప్రతిపాదనను సమర్థించారని సమావేశం తర్వాత వినోద్‌ కుమార్ తెలిపారు.

Advertisement
Update:2023-11-10 07:30 IST

డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారన్న వివాదంలో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాకు షాకిచ్చింది ఎథిక్స్ కమిటీ. లోక్‌సభ నుంచి మహువాను బహిష్కరించాలని సిఫార్సు చేసింది. బీజేపీ ఎంపీ వినోద్‌ కుమార్ సోంకర్ నేతృత్వంలో గురువారం సమావేశమైన కమిటీ.. మహువా బహిష్కరణకు సిఫార్సు చేస్తూ రూపొందించిన రిపోర్టును ఆమోదించింది.

ఎథిక్స్ కమిటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా.. ఆరుగురు సభ్యులు మహువాను బహిష్కరించాలన్న ప్రతిపాదనను సమర్థించారని సమావేశం తర్వాత వినోద్‌ కుమార్ తెలిపారు. నలుగురు సభ్యులు వ్యతిరేకించారన్నారు. 6-4 తేడాతో కమిటీ ఆమోదించిన ఈ రిపోర్టును తదుపరి చర్యల కోసం లోక్‌సభ స్పీకర్‌కు పంపనున్నారు.

అదానీ గ్రూప్‌, ప్రధాని మోదీ టార్గెట్‌గా ప్రశ్నలు అడిగేందుకు బిజినెస్‌మెన్‌ దర్శన్ హీరానందని నుంచి మహువా ముడుపులు అందుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ ఆరోపణలు చేయగా..విచారణ అనంతరం ఎథిక్స్ కమిటీ ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలని స్పీకర్‌కు సిఫార్సు చేసింది.

ఇక ఎథిక్స్ కమిటీ రిపోర్టుపై ఫైర్ అయ్యారు మహువా మొయిత్రా. ఈ సిఫార్సును ముందుగానే నిర్ణయించి అమలు చేస్తున్న తీర్పుగా అభివర్ణించారు. ఈ నిర్ణయం తనను ఆశ్చర్యపరచలేదన్నారు. ఇలాంటి ఘటనలు భారతదేశానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మరణంతో సమానమని మండిపడ్డారు. బహిష్కరిస్తే మరింత మంచి మెజార్టీతో వచ్చే లోక్‌సభలో అడుగుపెడతానని సవాల్ చేశారు. ఇక లోక్‌సభ ఎంపీని బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయడం చరిత్రలో ఇదే తొలిసారని తెలుస్తోంది. ప్రస్తుతం మహువా పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.


Tags:    
Advertisement

Similar News