రేపే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. వైసీపీ ఎటువైపు!

డిప్యూటీ స్పీకర్ పదవిపై NDA తేల్చకపోవడంతో ఇండియా కూటమి సైతం 8 సార్లు ఎంపీగా గెలిచిన సురేష్‌ కొడికున్నిల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.

Advertisement
Update:2024-06-25 17:37 IST

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయానికి అర్ధశతాబ్ధం తర్వాత బ్రేక్ పడింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. చివరగా ఎమర్జెన్సి సమయంలో అంటే 1976లో స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు NDA కూటమి చేసిన ప్రయత్నాలు చేయగా.. అవి ఫలించలేదు. NDA కూటమి ఏకపక్ష వైఖరి కారణంగానే ఎన్నిక అనివార్యమైందని ఇండియా అలయన్స్ నేతలు ఆరోపిస్తున్నారు.

స్పీకర్‌ పదవి కోసం మరోసారి ఓంబిర్లాను అభ్యర్థిగా ప్రకటించింది NDA. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు ఇతర ఇండియా కూటమి నేతలను కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. అయితే స్పీకర్‌ ఎన్నికకు సహకరించాలంటే డిప్యూటీ స్పీకర్ పదవిని అపోజిషన్‌కు ఇవ్వాలని కండీషన్ పెట్టారు ఇండియా కూటమి నేతలు. దీనిపై స్పందించకుండానే ఓంబిర్లాతో నామినేషన్ దాఖలు చేయించింది NDA. ఇక డిప్యూటీ స్పీకర్ పదవిపై NDA తేల్చకపోవడంతో ఇండియా కూటమి సైతం 8 సార్లు ఎంపీగా గెలిచిన సురేష్‌ కొడికున్నిల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. సురేష్‌ నామినేషన్ కూడా దాఖలు చేశారు. స్పీకర్‌ పదవికి రెండు నామినేషన్లు దాఖలు కావడంతో రేపు ఉదయం ఎన్నిక జరగనుంది. నిజానికి 2019 - 24 మధ్య డిప్యూటీ స్పీకర్ పదవిని మోడీ ప్రభుత్వం భర్తీ చేయలేదు. 2014 - 19 మధ్య మాత్రం బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇస్తే ఓంబిర్లాకు మద్దతిస్తామని ఇండియా కూటమి నేతలు చెప్తున్నారు. అయితే ఆ షరతును అంగీకరించేందుకు NDA కూటమి సిద్ధంగా లేదని సమాచారం.

ప్రస్తుతం లోక్‌సభలో NDA కూటమికి 293 మంది సభ్యులు, ఇండియా కూటమికి 232 మంది సభ్యులు ఉన్నారు. దీంతో NDA అభ్యర్థి ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నిక కావడం అనివార్యమే. అయితే ఈ ఎన్నిక ఇప్పుడు ఏ కూటమిలో లేని వైసీపీకి ఓ పరీక్ష లాంటింది. వైసీపీకి లోక్‌సభలో నలుగురు ఎంపీలున్నారు. స్పీకర్‌ ఎన్నికలో వైసీపీ ఎటువైపు నిలబడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పోరాడింది NDA కూటమితోనే. మరీ అలాంటి కూటమికే సపోర్ట్ చేస్తుందా.. లేదా, గతాన్ని మరిచి కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు నిలబెట్టిన అభ్యర్థికి మద్దతిస్తుందా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Tags:    
Advertisement

Similar News