ఎన్నికల ఏడాది.. కేంద్ర పథకాల హడావిడి

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో వచ్చే నాలుగు నెలల్లో 7కోట్లమందిని చేర్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెంచే యోచనలో ఉంది కేంద్రం.

Advertisement
Update:2023-06-20 13:32 IST

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హడావిడి పడుతోంది. గొప్పగా చెప్పుకోడానికి వారి దగ్గర ఏమీ లేదు, వైఫల్యాలు మాత్రం కోకొల్లలు. ఉద్యోగాలు లేవు, దేశ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా నిత్యావసరాల రేట్లన్నీ చుక్కలనంటుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. పెద్దనోట్ల రద్దుతో ఒరిగిందేమీ లేకపోగా కొత్తగా 2వేల రూపాయల నోట్ల విషయంలో మరోసారి పరువు పోగొట్టుకున్నారు మోదీ. వీటన్నిటినీ కవర్ చేసుకోడానికి సంక్షేమ పథకాల పేరుతో కనికట్టు చేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది.

గణాంకాలతో గంతలు..

ప్రతి ఇంటికీ మంచినీరు, ప్రతి కుటుంబానికి శాశ్వత నివాసం, రైతుల ఆదాయం రెట్టింపు లాంటి ఘనమైన హామీలతో రెండోసారి గద్దనెక్కిన ఎన్డీఏ ప్రభుత్వం అన్నిట్లోనూ విఫలమైంది. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఉన్న పథకాల లబ్ధిదారుల్ని భారీగా పెంచి చూపిచేందుకు, ఎన్నికల ఏడాదిలో బడ్జెట్ కేటాయింపులన్నిటినీ పూర్తిగా ఖర్చు చేసేలా ఆయా శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. వీలైనంత త్వరగా 2023-24 బడ్జెట్ కేటాయింపుల్ని ఉపయోగించుకోవాలని శాఖలపై ఒత్తిడి పెరుగుతోంది. 2024 బడ్జెట్ నాటికి పాత కేటాయింపులన్నీ పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

లాభమేంటి..?

ఏ ప్రభుత్వం అయినా ఎన్నికల ఏడాదిలో ఆకర్షణీయ బడ్డెట్ ప్రవేశపెడుతుంది. కేంద్రం మనకోసం అంత చేస్తుంది, ఇంత చేస్తుంది అనుకునేలా బిల్డప్ ఇస్తుంది. అయితే అంతకు ముందు బడ్జెట్ కేటాయింపులన్నీ పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాం అని చెప్పగలిగితేనే ప్రస్తుత బడ్జెట్ పై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అందుకే 2023-24 బడ్జెట్ కేటాయింపుల వినియోగంపై కేంద్రం దృష్టిపెట్టింది.

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో వచ్చే నాలుగు నెలల్లో 7కోట్లమందిని చేర్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెంచే యోచనలో ఉంది కేంద్రం. 3.34కోట్లమంది రైతులకు అదనంగా పీఎం కిసాన్ పేరిట లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద మొత్తంగా 7కోట్లమంది రైతులకు రిస్క్ కవరేజ్ ని అందించేందుకు వ్యవసాయ శాఖకు ఆదేశాలందాయి. 4కోట్ల కుటుంబాలకు అదనంగా మంచినీటి కనెక్షన్లు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇవన్నీ ఈ బడ్జెట్ కేటాయింపుల్లోనే పూర్తి కావాల్సి ఉంది.

సహజంగా బడ్జెట్ కేటాయింపుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోడానికి ప్రభుత్వాలే అడ్డుపడుతుంటాయి. సకాలంలో నిధులు విడుదల చేయకుండా వాటిని వేరే కార్యక్రమాలకు మళ్లిస్తుంటాయి అయితే ఎన్నికల ఏడాదిలో లెక్కలు చెప్పుకోడానికి కేంద్రం తహతహలాడుతోంది. పథకాల కేటాయింపులన్నీ పూర్తిగా వినియోగించుకోవాలని ఆయా శాఖలకు ఆదేశాలిచ్చింది. ఎన్నికలకోసం కొత్త ఎత్తులు వేస్తోంది. 

Tags:    
Advertisement

Similar News