హర్యానా, జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. డేట్స్‌ ఇవే

హర్యానాలో అక్టోబర్ 1న ఒకే విడతలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 3తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది.

Advertisement
Update: 2024-08-16 12:04 GMT

దేశంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. హర్యానా, జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో 90 చొప్పున అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. హర్యానాలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి అక్టోబర్ 4 ఓట్ల లెక్కింపు జరగనుంది.


జమ్ము కశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుంది. జమ్ము కశ్మీర్‌లో మొత్తం 87 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అక్క‌డ‌ 11 వేల 838 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి చివరగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి. జమ్ము కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఈ ఏడాదితో ఐదేళ్లు పూర్తి చేసుకోనుంది.


హర్యానాలో అక్టోబర్ 1న ఒకే విడతలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 3తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. హర్యానాలో 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 20 వేల 629 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా..సెప్టెంబర్ 12 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల విత్‌ డ్రాకు సెప్టెంబర్ 16 వరకు గడువు ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News