నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసలు పేరు అది కాదట
నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితంలో అనేక విషాదాలు దాగున్నాయి. ఆరేళ్లలో ద్రౌపది ముర్ము తన భర్తను, ఇద్దరు కొడుకులను, తల్లిని, సోదరుడిని కోల్పోయారు. ఈ విషయం ఆమే స్వయంగా ఓ మీడియాకు చెప్పారు.
భారత రాష్ట్రపతిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము అసలు పేరు అది కాదట.. తన పేరుకు సంబంధించి ఎవరికీ తెలియని వివరాలను ఆమె ఇటీవల ఓ ఒడియా వీడియో మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తన సంథాలీ పేరు 'పుతి' అని, అయితే తన మంచి కోసం టీచర్ ఒకరు తన పేరును 'ద్రౌపది' గా మార్చారని ఆమె చెప్పారు. 'నేను మయూర్ భంజ్ జిల్లాకు చెందితే ఆమె మరో జిల్లాకు చెందినవారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న మా జిల్లా నుంచి టీచర్లు 1960 ప్రాంతంలో బాలాసోర్ లేదా కటక్ జిల్లాకు ప్రయాణిస్తూ ఉండేవారు.. నేను చదువుతున్న స్కూల్లో ఓ టీచర్ కి నా పేరు నచ్చకపోవడంతో దాన్ని ఇలా ద్రౌపదిగా మార్చారు'. అని ఆమె తెలిపారు. పైగా తన పేరు చాలా సందర్భాల్లో 'దుర్పది' అని, లేదా 'దోర్పది' అని మారుతూ ఉండేదని అన్నారు. సంథాలీ తెగ కల్చర్ లో పేర్లు మారబోవని, అమ్మాయి పుడితే ఆమె పేరును ఆమె నాయనమ్మ లేదా అమ్మమ్మ పేరుతో, అలాగే అబ్బాయి పుడితే గ్రాండ్ ఫాదర్ లేదా పూర్వీకుల పేర్లు పెడతారని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అసలు స్కూళ్ళు, కాలేజీల్లో మా ఇంటిపేరు 'తుడు' .. కానీ బ్యాంక్ అధికారి అయిన శ్యామ్ చరణ్ ముర్ముతో నా వివాహమైన తరువాత 'ముర్ము' అనే పేరును జోడించుకున్నాను అని ఆమె వివరించారు.
ఆరేళ్లలో ద్రౌపది ముర్ము తన భర్తను, ఇద్దరు కొడుకులను, తల్లిని, సోదరుడిని కోల్పోయారు. 2009-2015 సంవత్సరాల మధ్యకాలంలో ఆమెను ఇలా విషాద ఘటనలు వెన్నాడాయి. 2009 లో ఓ కుమారుడు, ఆ తరువాత మూడేళ్లకు రెండో కుమారుడు యాక్సిడెంట్ లో మరణించగా, అంతకుముందే భర్త శ్యామ్ చరణ్ ముర్ము గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఈ విషాదాల నుంచి మనోధైర్యాన్ని పొందేందుకు ఆమె బ్రహ్మకుమారీస్ కేంద్రంలో కొన్ని నెలల పాటు యోగా, మెడిటేషన్ చేస్తూ వచ్చారు. 13 ఏళ్ళ క్రితం ఆమె మౌంట్ అబూ లోని బ్రహ్మ కుమారీ సంస్థానాన్ని సందర్శించారు. ఝార్ఖండ్ గవర్నర్ గా ఆరేళ్ళు వ్యవహరించిన తరువాత.. గత ఏడాది జులై 12 న ఒడిశా లోని తన రాయ్ రంగాపూర్ గ్రామానికి వెళ్లి అక్కడే గడుపుతూ వచ్చారు. ముర్ము కుమార్తె ఒడిశాలో ఓ బ్యాంక్ ఉద్యోగిని.