కరెంటు కష్టాలు.. ప్రజలు ఫ్యాన్లు వాడొద్దని బీజేపీ ప్రభుత్వం సలహా
వేసవి కాలంలో పెరిగిన వినియోగానికి తగ్గట్టుగా కరెంటు ఉత్పత్తి పెంచుకోలేక, ఇతర రాష్ట్రాలనుంచి కొనుగోలు చేసే ఆర్థిక శక్తి లేక ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో ప్రజలకు ఉచిత సలహాలిస్తూ నవ్వులపాలవుతున్నారు బీజేపీ నేతలు.
"రాష్ట్రంలో కరెంటు కష్టాలున్నాయి. ఎండాకాలంలో భారీగా విద్యుత్ వినియోగం పెరిగింది. ప్రజలు విచ్చలవిడిగా ఫ్యాన్లు వాడితే ఇక కష్టమే. కాస్త మీ పంకాలు ఆపేయండి" అంటూ అసోం అసెంబ్లీ స్పీకర్ విశ్వజిత్ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చారు. అంతే కాదు ఎలక్ట్రిక్ పరికరాలను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది అన్నారాయన. అసోం పాలిత బీజేపీలో కరెంటు కష్టాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డబుల్ ఇంజిన్ డెవలప్ మెంట్ కోసం అనుకున్నాం కానీ, ఇలా ట్రబుల్ ఇంజిన్ గా మారుతుందని అస్సలు అనుకోలేదని స్థానికులు వాపోతున్నారు.
అసోంలో కరెంటు కష్టాలను బీజేపీ ప్రభుత్వం కవర్ చేసుకోలేకపోతోంది. వేసవి కాలంలో పెరిగిన వినియోగానికి తగ్గట్టుగా కరెంటు ఉత్పత్తి పెంచుకోలేక, ఇతర రాష్ట్రాలనుంచి కొనుగోలు చేసే ఆర్థిక శక్తి లేక చేతులెత్తేసింది. దీంతో ప్రజలకు ఉచిత సలహాలిస్తూ నవ్వులపాలవుతున్నారు బీజేపీ నేతలు. తాజాగా అసెంబ్లీ స్పీకర్ విశ్వజిత్ చేసిన వ్యాఖ్యలుసంచలనంగా మారాయి. ప్రజలెవరూ ఫ్యాన్లు వాడొద్దని ఆయన చెప్పడంతో, ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.
విద్యుత్తు విషయంలో రాష్ట్రం స్వీయ స్థిరత్వం పొందేలా ప్రజలు పొదుపుగా విద్యుత్ వాడాలని ఉచిత సలహా ఇచ్చారు స్పీకర్ విశ్వజిత్. ఒకవేళ పక్క రాష్ట్రాలనుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే ఆ భారం కూడా ప్రజలపై పడుతుందని హెచ్చరించారు. "మీరు కరెంటు ఎక్కువాడితే, చార్జీలు పెంచాల్సి వస్తుంది, అందుకే సహకరించండి, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు బంద్ చేయండి." అంటూ సలహాలిస్తున్న బీజేపీ నేతలది దివాళాకోరు రాజకీయమంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.