ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటేయకుంటే రెండ్రోజులు తినొద్దు.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

బంగర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) డిమాండ్ చేసింది. బంగర్ చేసిన వ్యాఖ్యలు ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.

Advertisement
Update:2024-02-11 16:42 IST

వచ్చే ఎన్నికల్లో ' మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకుంటే రెండు రోజులపాటు తిండి తినవద్దని మహారాష్ట్ర కు చెందిన ఓ ఎమ్మెల్యే పిల్లలను కోరడం వివాదాస్పదం అయింది. ఈ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని పలు పార్టీలు ఈసీని కోరాయి. శివసేన (షిండే వర్గం)కు చెందిన కలమ్ నూరి ఎమ్మెల్యే సంతోష్ బంగర్ ఇటీవల హింగోలి జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే రెండు రోజులు భోజనం చేయకుండా ఉండాలని కోరాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఈ విషయం గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తే సంతోష్ బంగర్ కి ఓటు వేసిన తర్వాతే తింటామని చెప్పాలని.. సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బంగర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పదేళ్ల వయసు కూడా లేని పిల్లలతో ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడటాన్ని పలువురు తప్పుపట్టారు. ఎన్నికల ప్రచారంలో పిల్లల్ని వాడుకోవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే బంగర్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.

బంగర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) డిమాండ్ చేసింది. బంగర్ చేసిన వ్యాఖ్యలు ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. పాఠశాలకు వెళ్లి విద్యార్థులను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్నారా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.

కాగా, బంగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ తిరిగి ప్రధాని కాకపోతే ఉరి వేసుకుని చనిపోతానంటూ ఇటీవల బంగర్ చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది.

Tags:    
Advertisement

Similar News