విపక్ష ఇండియా కూటమిలో విభేదాలు

అదానీ వ్యవహారం,యూపీలోని సంభల్‌ అల్లర్లపై చర్చకు విపక్షాలు పట్టు... వాకౌట్‌ చేసిన ఇండియా కూటమి... నిరసనలకు దూరంగా ఉన్న టీఎంసీ, ఎస్పీ

Advertisement
Update:2024-12-03 12:45 IST

విపక్ష ఇండియా కూటమిలో విభేదాలు పార్లమెంటు వేదికగా మరోసారి బైటపడ్డాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ప్రాంగణంలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలో ఈ నిరసనలు జరగగా.. దీనికి సమాజ్‌వాదీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు దూరంగా ఉండటం విశేషం.

శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం విదితమే. అదానీ వ్యవహారం, యూపీలోని సంభల్‌ అల్లర్లు తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో గత వారమంతా సభా కార్యకలాపాలు స్తంభించాయి. చివరికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా జోక్యంతో ఇది కొలిక్కి వచ్చినట్లే కనిపించింది. దీంతో మంగళవారం ఉభయ సభలు సజావుగానే ప్రారంభమయ్యాయి. యూపీలోని సంభల్‌ హింసాకాండలో బీజేపీ ప్రమేయం ఉన్నదని ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. దీంతో లోక్‌సభలో గందరగోళం నెలకొన్నది. ఈ క్రమంలోనే లోక్‌సభ ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశంపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్‌ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశాయి. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు ప్లకార్డుల చేతబట్టి ఆందోళన చేపట్టారు. నిరసనలో వయనాడ్‌ ఎంపీ ప్రియాంకగాంధీ పాల్గొన్నారు. అయితే ఇందులో టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలు పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. సోమవారం జరిగిన విపక్ష కూటమి భేటీకి కూడా టీఎంసీ దూరంగా ఉన్నది. పార్లమెంటు సజావుగా సాగాలని తాము కోరుకుంటున్నామని తృణమూల్‌ నేతలు చెబుతున్నారు.

 కొనసాగుతున్నఉభయ సభలు

ప్రతిపక్షాల ఆందోళనలతో తరుచూ వాయిదా పడుతున్న ఉభయ సభలు మంగళవారం కొనసాగుతున్నాయి. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు బదులు ఇచ్చారు. పలు బిల్లులను ప్రవేశపెట్టి చర్చ జరుపుతున్నారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భం పై ఈ నెల 13, 14 తేదీల్లో లోక్‌సభలో, 16,17 తేదీల్లో రాజ్యసభలో చర్చ చేపట్టనున్నారు.

Tags:    
Advertisement

Similar News