డిజిటల్ చెల్లింపుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్..

గతంలో సగటున ఓ ఖాతాదారుడు ఒక ఏడాదిలో 16 సార్లు ATMలకు వెళ్తే, ఇప్పుడు కేవలం 8 సార్లు మాత్రమే ATMలను సందర్శిస్తున్నాడు. ఆర్థిక లావాదేవీలు మొత్తం డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నాయి.

Advertisement
Update:2023-08-24 06:19 IST

భారత్ లో జరుగుతున్న డిజిటల్ చెల్లింపుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్-5లో ఉండటం విశేషం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రీసెర్చ్ నివేదిక ప్రకారం ఏపీకి ఇందులో మొదటి స్థానం దక్కింది. తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ లావాదేవీల సంఖ్య ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతోందని SBI నివేదిక తెలిపింది.

ఆ 15 రాష్ట్రాలే కీలకం..

దేశం మొత్తమ్మీద డిజిటల్ చెల్లింపులు బాగున్నాయి అంటే అన్ని రాష్ట్రాల్లో డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి అనుకోవడం సరికాదని SBI సర్వే చెబుతోంది. గరిష్టంగా 15 రాష్ట్రాల్లో మాత్రమే డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. దేశం మొత్తంలో జరిగే డిజిటల్ పేమెంట్స్ లో ఆ 15 రాష్ట్రాల వాటా 90శాతం. మిగతా రాష్ట్రాల వాటా కేవలం 10శాతం. అంటే జరిగే లావాదేవీలన్నీ ఆ 15 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అందులో ఏపీ, తెలంగాణ.. టాప్ లో నిలబడ్డాయి.

ఏటీఎంలపై మొహం మొత్తింది

దేశ జీడీపీలో 2017లో ATMల నుంచి 15.4 శాతం నగదు ఉపసంహరణలు జరుగగా.. 2023లో ఆ పరిమాణం 12.1 శాతానికి తగ్గిపోయింది. గతంలో సగటున ఓ ఖాతాదారుడు ఒక ఏడాదిలో 16 సార్లు ATMలకు వెళ్తే, ఇప్పుడు కేవలం 8 సార్లు మాత్రమే ATMలను సందర్శిస్తున్నాడు. ఆర్థిక లావాదేవీలు మొత్తం డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నాయి. డిజిటల్‌ చెల్లింపులు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదని, గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాలు కూడా ఇందులో 60 శాతం వాటా కలిగి ఉన్నట్లు SBI సర్వే తెలిపింది.

యూపీఐ టాప్..

గతంలో డిజిటల్ చెల్లింపులు అంటే ఆన్ లైన్ బ్యాంకింగ్ లేదా, బ్యాంక్ నుంచి జరిగే ఆర్టీజీఎస్ తదితర ట్రాన్సాక్షన్లు మాత్రమే. కానీ యూపీఐ వచ్చిన తర్వాత వాటికి కాలం చెల్లింది. ప్రస్తుతం దేశంలో వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ విలువ 73 శాతం ఉంది. యూపీఐ లావాదేవీల సంఖ్య 2017లో 1.8 కోట్లు కాగా, 2023 నాటికి 8,375 కోట్లకు పెరిగింది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ రూ.6,947 కోట్ల నుంచి రూ.139 లక్షల కోట్లకు చేరింది. అంటే.. 2004 రెట్లు పెరిగిందన్నమాట.  

Tags:    
Advertisement

Similar News