స్పీకర్ బిడ్డ పెండ్డి కోసమే ఢిల్లీకి పోతున్న
ఢిల్లీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు : సీఎం రేవంత్ రెడ్డి
స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికే ఈరోజు సాయంత్రం తాను, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నామని, ఈ ఢిల్లీ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో ఎంపీలుగా పని చేశామని, స్పీకర్ ఓం బిర్లాతో తమకు వ్యక్తిగత సంబంధాలున్నాయని చెప్పారు. ఆయన తన కుమార్తె వివాహానికి ప్రత్యేకంగా ఆహ్వానించారని, అందుకే వెళ్తున్నామని చెప్పారు. ఇన్ కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడంతో అదానీ సహా ఏ సంస్థ ఇచ్చిన విరాళం కూడా స్కిల్ యూనివర్సిటీ ఖాతాలోకి చేరలేదు. అదానీ ఉదారంగా ముందుకు వచ్చి విరాళం ఇస్తామని చెప్పనా.. రూ.100 కోట్లు బదిలీ చేయొద్దని కోరామన్నారు. సదుద్దేశంతో ప్రారంభించిన యంగ్ ఇండియా యూనివర్సిటీ వివాదాస్పదం కావొద్దనే తాను, తన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అనవసరమైన వివాదాల్లో తమ ప్రభుత్వాన్ని లాగొద్దన్నారు. తాను, రాష్ట్రం నుంచి మంత్రులు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ అయిపోయిందని శాఖలు కూడా మీడియానే పంచేస్తుందని.. ఈ టూర్ విషయంలో అలాంటి ప్రచారానికి తావు లేదన్నారు.
తాను ఎవరి కాళ్లో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో ఢిల్లీకి వెళ్లడం లేదన్నారు. ''గత పదేళ్లుగా తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది.. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం మన హక్కు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు బీజేపీ తన ట్రెజరీ నుంచి ఏం ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచే ఇస్తుంది.. రాజకీయ పక్షపాతం చూపకుండా నిధులు రాబట్టాలంటే, ఢిల్లీకి వెళ్లి వాకిరి కలిస్తేనే నిధులు రాబట్టుకోగలం.. ఇందుకోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళతాం.. మీ కడుపు మంట, దుఃఖం మాకు తెలుసు.. మీ కాకి గోలను మేం పట్టించుకోము.. ఇది ఒకరిపై కోపం, పగ చూపాల్సిన సమయం కాదు.. కార్యదీక్షతో తెలంగాణ అభివృద్ధి కోసం మేం ముందుకు వెళ్తున్నాం.. అదానీ ఫ్లైట్ లో ఆడంబరంగా తిరిగింది వాళ్లు.. పెట్టుబడుల విషయంలో ఎవరికీ ఆయాచిత లబ్ది చేకూర్చం.. కేసీఆర్ లా మేం అదానీ నుంచి అప్పనంగా తీసుకోలేదు.. అదానీతో ఎన్నో ఒప్పందాలు చేసుకున్నవారు మాపై ఆరోపణలు చేస్తున్నారు... రేపు తెలంగాణ లోక్‌సభ, రాజ్యసభ సభ్యలతో సమావేశమవుతాం.. రాష్ట్ర ప్రభుత్వం తరపున సభలో లేవనెత్తాల్సిన అంశాలపై వారితో చర్చిస్తాం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను తీసుకొచ్చేందుకు కావాల్సిన కార్యాచరణ రూపొందిస్తాం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం రేపు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలుస్తాం.. '' అని తెలిపారు.