లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశం.. ఈసారి ఏం చెప్పారంటే..?
కేజ్రీవాల్ నుంచి తమకు ఆదేశాలు అందాయని, వాటి ప్రకారం పనులు చేసుకుంటూ వెళ్తున్నామని మంత్రులు చెప్పడంతో ఈడీ షాకైంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే కస్టడీ నుంచే ఆయన ఢిల్లీ పాలన కొనసాగిస్తున్నారు. ఈమేరకు ఆయన మంత్రి వర్గం రోజుకో ప్రెస్ మీట్ నిర్వహిస్తూ కేజ్రీవాల్ తమకు ఇచ్చిన ఆదేశాలను మీడియాకు తెలియజేస్తున్నారు. అయితే తమ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ బయటకు ఎలా ఆదేశాలు పంపిస్తున్నారంటూ ఈడీ అధికారులు తల పట్టుకున్నారు. సీసీ కెమెరాలు మళ్లీ చెక్ చేస్తున్నారు. కేజ్రీవాల్ తమకు సమాచారమిచ్చారంటూ ప్రెస్ మీట్ పెట్టిన మంత్రుల్ని వారు ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ లాకప్ పాలన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి పాలన కొనసాగించగలరా..? ఒకవేళ కొనసాగిస్తే అది ఎలా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయి జైలులో ఉన్నా లేదా పోలీసుల కస్టడీలో ఉన్నా.. ఆయన స్థానంలో అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాలన కొనసాగించడం ఆనవాయితీ. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తోందని ఆరోపిస్తున్న ఆప్.. కేజ్రీవాల్ రాజీనామాకు ఒప్పుకోలేదు. కేజ్రీవాల్ కూడా ఈడీ కస్టడీనుంచే పాలన కొనసాగిస్తానన్నారు. ఇటీవల ఆయన జలవనరుల శాఖ మంత్రి ఆతిశీకి ఓ నోట్ ద్వారా ఉత్తర్వులిచ్చారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆయన తనకు సూచనలు చేసినట్టు తెలిపారు మంత్రి ఆతిశీ. తాజాగా ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా తనకు కేజ్రీవాల్ నుంచి ఆదేశాలు అందాయని చెప్పారు. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. కస్టడీలో ఉన్నా కూడా సీఎం కేజ్రీవాల్ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తున్నారని మంత్రి సౌరభ్ తెలిపారు.
కేజ్రీవాల్ నుంచి తమకు ఆదేశాలు అందాయని, వాటి ప్రకారం పనులు చేసుకుంటూ వెళ్తున్నామని మంత్రులు చెప్పడంతో ఈడీ షాకైంది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు తాము కనీసం కాగితాలు కూడా ఇవ్వలేదని, కంప్యూటర్ కూడా ఆయనకు అందుబాటులో లేదని, అలాంటప్పుడు ఆయన మంత్రులకు ఎలా ఆదేశాలిస్తారని అంటున్నారు ఈడీ అధికారులు. మంత్రుల్నే నేరుగా ఈ విషయంపై ప్రశ్నించాలనుకుంటున్నారు.