కేజ్రీవాల్ కి ఊరట.. బెయిల్ మంజూరు

ఈడీ కేసులో బెయిలొచ్చినా, సీబీఐ కేసు కారణంగా కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

Advertisement
Update: 2024-07-12 05:49 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలతో కేజ్రీవాల్ ని మార్చి-21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసు విచారణ అనేక మలుపులు తిరిగింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ల వ్యవహారం కూడా సంచలనంగా మారింది. ట్రయల్ కోర్ట్ బెయిలివ్వడం, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడం.. ఇలా ఈ బెయిల్ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. చివరకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ కి ఊరట లభించింది.

ఈడీ అరెస్ట్ ని కేజ్రీవాల్ గతంలోనే సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10న కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు 21 రోజుల మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల చివరి దశ ముగిసిన తర్వాత జూన్ 2న ఆయన తిరిగి కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత మళ్లీ జూన్ 20వ తేదీన ఢిల్లీలోని ట్రయల్ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. బెయిల్ మంజూరు చేయడంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంతో ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

బెయిలొచ్చినా బయటకు రాలేరు..!

ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిలిచ్చినా కేజ్రీవాల్, జైలు నుంచి బయటకు రాలేని పరిస్థితి. జూన్ 26న కేజ్రీవాల్ ని సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. జూన్ 29 వరకు ఆయన సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఈడీ కేసులో బెయిలొచ్చినా, సీబీఐ కేసు కారణంగా కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News