ఆ ఎక్స్‌పీరియన్స్... దాదా సొంతం!
అజిత్ పవర్‌ను ఉద్దేశించి షిండే.. 'మహా' ప్రెస్‌మీట్‌లో నవ్వులే నవ్వులు
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు ముందు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ బుధవారం ముంబయిలో సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్‌మీట్ నవ్వులు పూయించింది. ఫడ్నవీస్‌తో పాటే ఏక్‌నాథ్ షిండే కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా అనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు షిండే, అజిత్ పవర్ నవ్వులతో అల్లరి చేశారు. అజిత్ పవర్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనే ప్రశ్నకు ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ.. సాయంత్రం వరకు వేచి చూడండి అని సమాధానమిచ్చారు. అజిత్ పవర్ రియాక్ట్ అవుతూ సాయంత్రం వరకు ఆయనకే అర్థమవుతుంది.. నేను ప్రమాణ స్వీకారం చేస్తా, వెయిట్ చేసేది లేదు అని సమాధానమిచ్చారు. షిండే జోక్యం చేసుకొని ఉదయం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన ఎక్స్‌పీరియన్స్ దాదా (అజిత్ పవార్)కే సొంతం అని చెప్పారు. దీంతో ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్న ముగ్గురితో పాటు మీడియా ప్రతినిధులు నవ్వుల్లో మునిగితేలారు.
గురువారం సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతల సమక్షంలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరుతుందని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మహాయుతి ప్రభుత్వంలో చేరాలని ఏక్‌నాథ్ షిండేను కోరామని.. ఈ రోజు సాయంత్రానికి ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది తేలుతుందని ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి కూటమిని ఆహ్వానించాలని కోరుతూ రాజ్‌భవన్ లో ముగ్గురు నేతలు గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తమ కూటమికి ఉన్న సభ్యుల సంఖ్యాబలం, ఇతర వివరాలను గవర్నర్‌కు అందజేశారు. గురువారం సాయంత్రం ప్రగతి మైదాన్‌లో మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. కీలక శాఖల కోసం షిండే పట్టుబడుతుండటంతో మొదటి విడతలో సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం వరకే కార్యక్రమం పరిమితం కావొచ్చని ప్రచారం జరుగుతోంది.