ఎక్స్ బిబి వేరియంట్ అంత ప్రమాదకరమా..? కేంద్రం ఏం చెబుతోంది..?
XBB variant of Coronavirus: అసలు ఎక్స్ బిబి అంత ప్రమాదకరమా, ఇది ఇంతకు ముందు ఎక్కడ బయటపడింది, ఎంతమందిని ప్రభావితం చేసింది, ఎన్ని మరణాలకు కారణమైంది..? ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
"భారత్ లో కరోనా కొత్త వేరియంట్, దాని పేరు ఎక్స్ బిబి. ఇది డెల్టా కంటే ఐదురెట్లు ఎక్కువ ప్రమాదకరం. లక్షణాలు కనపడకపోయినా రోగి చనిపోతాడు. జాగ్రత్తగా లేకపోతే ప్రాణ నష్టం అధికం." ఈరోజు సోషల్ మీడియాలో అత్యథికంగా చక్కర్లు కొట్టిన మెసేజ్ ఇది. అసలు ఎక్స్ బిబి అంత ప్రమాదకరమా, ఇది ఇంతకు ముందు ఎక్కడ బయటపడింది, ఎంతమందిని ప్రభావితం చేసింది, ఎన్ని మరణాలకు కారణమైంది..? ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఎక్స్ బిబి వేరియంట్ సంగతేంటి..? దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది.
ఫేక్ వార్త..
విదేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగితున్నాయి. భారత్ లో కూడా ముప్పు ముంచుకొచ్చే అవకాశాలున్నాయంటూ కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. అంతేకాని, భారత్ లో కేసులు పెరిగాయని, ఆంక్షలు మొదలవుతున్నాయని ఎక్కడా చెప్పలేదు. మాస్క్ మంచిదే, మళ్లీ ధరించండి అని మాత్రం సూచనలిచ్చింది కేంద్రం. దీంతో ఒక్కసారిగా వాట్సప్ యూనివర్శిటీలు చెలరేగిపోయాయి.
సోషల్ మీడియాలో కొంతమంది కావాలనే ఇలాంటి కొత్త కొత్త వేరియంట్ల పేర్లు చెప్పి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. అవన్నీ ఫేక్ వార్తలంటూ కొట్టిపారేసింది. కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన చెప్పింది. ఎక్స్ బిబి వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. ఆ వేరియంట్ వల్ల వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.
కొత్తగా భారత్ లో బిఎఫ్-7 వేరియంట్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీనివల్ల కూడా ప్రమాదం పెద్దగా ఉండదని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో అప్రమత్తత అవసరం అంటున్నారు. మాస్క్ లు వేసుకోండి, సమూహాలుగా చేరకండి అని చెబుతున్నారు.
అయితే క్రిస్మస్ సీజన్ లో ప్రస్తుతం షాపింగ్ సందడి పెరిగింది. త్వరలో కొత్త సంవత్సరం వేడుకలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో కరోనా వ్యాప్తికి అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఫేక్ వార్తలతో భయాందోళనలకు గురి కావద్దని సూచిస్తున్నారు.