పాదయాత్రలో సినిమా పాట.. రాహుల్‌పై కేసు నమోదు
రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాథ్, జైరామ్ రమేష్ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో సంచలనంగా మారింది.
రామాయణంలో పిడకల వేట అంటే ఇదేనేమో.. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ సినిమా పాట వాడుకున్నారంటూ రాహుల్ గాంధీపై కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదైంది. దీనిపై రాహుల్ టీమ్ ఇంకా స్పందించాల్సి ఉంది. పాదయాత్రకు ఊపు తెచ్చేందుకు ఎవరో అత్యుత్సాహంతో చేసిన పని ఇప్పుడు పార్టీకి చుట్టుకుంది. పార్టీ అధికారికంగా సోషల్ మీడియా ఖాతాల్లో ఆ పాటను పెట్టడంతో ఆడియో హక్కుల ఉల్లంఘన కింద కేసు పెట్టారు.
సినిమా పాట ఎందుకు వాడారు..?
ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నాటకలో ముగిసింది. కన్నడలో సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ ఆడియోని ఈ సందర్భంగా అభిమానులు రాహుల్ వీడియోలకు జోడించారు. రాహుల్ వీడియోలను అందంగా ఎడిట్ చేసి బ్యాక్ గ్రౌండ్ లో కేజీఎఫ్ ఆడియోని ఉంచారు. ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంది. అభిమానులు చేసిన ఈ వీడియోను కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. దీంతో అసలు రచ్చ మొదలైంది. ఆ ఆడియోపై సర్వహక్కులు తమవేనంటూ ఎంఆర్టీ అనే సంస్థ పోలీసుల్ని ఆశ్రయించింది. కాపీరైట్ ఉల్లంఘటన జరిగిందని ఆరోపించింది.
సదరు సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో వెంటనే పోలీసులు స్పందించారు. రాహుల్ గాంధీ సహా మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాథ్, జైరామ్ రమేష్ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో సంచలనంగా మారింది. వెంటనే ఆ కేసు వ్యవహారం సెటిల్ చేసుకోవడానికి రంగంలోకి దిగారు పార్టీ న్యాయ విభాగం సిబ్బంది. సదరు సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేవలం ప్రచారం కోసం ఈ పనిచేశారా లేక పాటను సోషల్ మీడియా నుంచి తొలగిస్తే సరిపోతుందా, లేదా నష్టపరిహారం ఆశిస్తున్నారా అనే విషయంలో చర్చలు జరుపుతున్నారని సమాచారం.