కాషాయ రంగు, కమలం గుర్తుతో G20 లోగో - విపక్షాల మండిపాటు

కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన జీ20 లోగోలో బీజేపీ జెండా రంగులు, కమలం గుర్తు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ దీనిపై మండిపడింది.

Advertisement
Update:2022-11-09 16:23 IST

ఈ సారి G20 దేశాల సమావేశానికి ఇండోనేషియా ఆతిథ్యం ఇస్తోంది. నవంబర్ లో బాలీ లో ఈ సమావేశాలు జరగనున్నాయి. భారత్ తో సహా 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ పాల్గొనే ఈ సమావేశాల్లో ఈ సారి అధ్యక్ష పదవి భారత్ ను వరించనుంది.

అయితే ఈ సమావేశాలకోసం భారత్ తయారు చేసిన అధికారిక లోగో వివాదాస్పదమయ్యింది. కాషాయ రంగులో ఉన్న ఆ లోగోలో కమలం పువ్వు ఉన్నది. దీనిపై అన్ని వైపుల నుండి విమర్శలు వస్తున్నాయి. బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ మండి పడింది. ఏ మాత్రం సిగ్గు లేకుండా అంతర్జాతీయ సమావేశాల్లో కూడా పార్టీ ప్రచారాన్ని చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. ఇలాంటి చర్యను తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తిరస్కరించారని ఆయన తెలిపారు.

"70 సంవత్సరాల క్రితం, నెహ్రూ కాంగ్రెస్ జెండాను భారతదేశం జెండాగా మార్చాలనే ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు, G20 సమావేశాలకు BJP ఎన్నికల గుర్తును అధికారిక చిహ్నంగా మార్చారు. ఈ చర్య తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నప్పటికీ, మోడీ, బీజేపీ ఇలాంటి చవకబారు పనులే చేస్తారని మనకు తెలుసు. సిగ్గు లేకుండా తమను తాము ప్రమోట్ చేసుకోవడం వారికే చెల్లింది" అని జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు.

దీనిపై బీజేపీ అడ్డగోలు వాదనకు దిగింది. "కమల్‌నాథ్ పేరు నుండి కమల్‌ను తొలగిస్తారా?" అని బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.

"కమలం మన జాతీయ పుష్పం. ఇది మహాలక్ష్మి యొక్క ఆసనం కూడా. మీరు మన‌ జాతీయ పుష్పాన్ని వ్యతిరేకిస్తున్నారా? మీరు కమల్‌ను కమల్ నాథ్ పేరు నుండి తొలగిస్తారా?" అని పూనావాలా ట్వీట్ చేశారు.

"ఈ G20 లోగో కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు, ఇది ఒక సందేశం, మన నర నరాల్లో ప్రవహించే భావోద్వేగం. ఒక సంకల్పం, ఇది ఇప్పుడు మన ఆలోచనలలో ఒక భాగం" అని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం జి20 అధ్యక్ష పదవిని చేపట్టనుందని, ఇది 130 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని ప్రధాని అన్నారు.

"ప్రపంచంలో సంక్షోభం, గందరగోళం వ్యాపించి ఉన్న ఈ సమయంలో భారతదేశానికి అధ్యక్ష పదవి వస్తుంది... పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, కమలం ఇంకా వికసిస్తుంది" అని పిఎం మోడీ అన్నారు,

G20 శిఖరాగ్ర సమావేశం నవంబర్ 15 మరియు 16 తేదీలలో బాలిలో జరుగుతుంది. దీనికి హాజరయ్యే అగ్ర నాయకులలో ప్రధాని మోడీ కూడా ఉన్నారు.



Tags:    
Advertisement

Similar News