రాహుల్ గాంధీని అశోక్ నగర్ కు తీసుకురండి
బిర్యానీతో ఆతిథ్యం ఇస్తాం, భారత రాజ్యాంగం పుస్తకం అందిస్తాం : టీజీపీఎస్సీ అభ్యర్థులు
కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీని అశోక్ నగర్ కు తీసుకురావాలని టీజీపీఎస్సీ అభ్యర్థులు (ఆశవహులు) విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మంగళవారం సాయంత్రం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీజీని అశోక్ నగర్ కు తీసుకురావాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయనను కలవడానికి తామంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఆయనకు ప్రఖ్యాత హైదరాబాద్ బిర్యానీతో ఆతిథ్యం ఇస్తామన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అంటే ఎంటో సరిగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఆయనకు భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహూకరిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అశోక్ నగర్ కు వెళ్లిన రాహుల్ గాంధీ సెంట్రల్ లైబ్రరీతో పాటు బవార్చీ హోటల్ లో నిరుద్యోగులతో సమావేశమయ్యారు. వారితో కలిసి బిర్యానీ తిన్నారు. రోడ్డుపై చాయ్ తాగారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు గ్రూప్ -1, గ్రూప్ -2 సహా అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన జీవో 29తో రూల్ రిజర్వేషన్ కు తుంగలో తొక్కారని నిరుద్యోగులు కొన్నాళ్లుగా ఆందోళనలో ఉన్నారు. అశోక్ నగర్ రోడ్లపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జీ చేయించింది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు రాహుల్ గాంధీని అశోక్ నగర్ కు తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను ఎక్స్ వేదికగా కోరారు.