రైళ్లలో రద్దీ.. అమితాబ్ సాయం కోరుతూ కాంగ్రెస్ చేసిన ట్వీట్ వైరల్

ప్రయాణికులు రైలు బోగీల్లో గాలి ఆడక విసనకర్రలు వెంట తెచ్చుకోవాల్సి వస్తోంది. తగినన్ని రైళ్లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల గురించి గతంలో తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని కోరాం. ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

Advertisement
Update:2024-05-31 17:36 IST

రైళ్లలో రద్దీ గురించి ఇటీవల తరచూ వార్తలు వస్తున్నాయి. రైళ్ల సంఖ్య తగినంతగా లేకపోవడంతో బోగీల నిండా ప్రయాణికులు కనిపిస్తున్నారు. ప్రయాణికులు సాధారణ టికెట్ కొని స్లీపర్, ఏసీ బోగీలు ఎక్కుతున్నారు. రిజర్వేషన్ బోగీల్లో కూడా కూర్చోవడానికి ప్లేస్ ఉండడం లేదు. కాగా, ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. బాలీవుడ్ అగ్రహీరో అమితాబచ్చన్ పేరును ప్రస్తావించి రైళ్లలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది.

కిక్కిరిసిన రైలు బోగీల్లో ప్రయాణికులు పడుతున్న పాట్లకు సంబంధించిన దృశ్యాలను, వీడియోలను కేరళ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ సహాయం కోరింది. 'దేశంలో కోట్ల మంది సామాన్య ప్రజలు ఇలా రద్దీ రైళ్ల‌ల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. రిజర్వేషన్ చేసుకున్న బోగీల్లో కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది. ప్రస్తుతం ఉత్తర భారత దేశంలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ రైళ్లలో జనం కిక్కిరిసి వెళ్లాల్సి వస్తోంది.

ప్రయాణికులు రైలు బోగీల్లో గాలి ఆడక విసనకర్రలు వెంట తెచ్చుకోవాల్సి వస్తోంది. తగినన్ని రైళ్లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల గురించి గతంలో తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని కోరాం. ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

సెలబ్రిటీలు, ప్రముఖులు ఏదైనా చిన్న సమస్య ప్రస్తావిస్తే చాలు కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిష్కరించడంలో ముందుంటుంది. అందుకే అమితాబ్ బచ్చన్ పేరును తాము వాడుకోవాల్సి వచ్చింది. అమితాబ్ ప్రభావవంతమైన వ్యక్తి. సామాజిక సమస్యల పట్ల గళ మెత్తే వ్యక్తి. అందుకే అమితాబ్ ఈ అంశంపై స్పందించాలని తాము కోరుతున్నాం. మీ సహకారం వల్ల ప్రయాణికుల సమస్యకు పరిష్కార లభించే అవకాశం ఉంది' అని కేరళ కాంగ్రెస్ ట్వీట్ లో పేర్కొంది. దేశంలో రైళ్లల్లో రద్దీ నియంత్రణ కోసం కాంగ్రెస్ అమితాబ్ సహాయం కోరుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    
Advertisement

Similar News