సోషల్ మీడియాలో వార్.. కాంగ్రెస్ బీజేపీ మధ్య ‘అన్ ఫార్చునేట్లీ’ సెటైర్లు
రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ కవర్ చేసుకోవాలనుకోలేదు. రాహుల్ గాంధీ వెంటనే వివరణ ఇచ్చారని, అయినా కూడా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు జైరాం రమేష్.
‘అన్ ఫార్చునేట్లీ ఐ యామ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్’ అంటూ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన వెంటనే సర్దుకుని అన్ ఫార్చునేట్లీ ఫర్ యు.. అని చెప్పినా బీజేపీ మాత్రం దాన్ని భూతద్దంలో చూస్తోంది.
రాహుల్ ఎందుకలా అన్నారు..?
బీజేపీని విమర్శించే క్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వారి దురదృష్టంకొద్దీ తాను పార్లమెంట్ మెంబర్ గా ఉన్నానని చెప్పాలనుకున్నారు. కానీ దురదృష్టంకొద్దీ తాను పార్లమెంట్ మెంబర్ అని అనేశారు. అయితే పక్కనే ఉన్న జైరాం రమేష్ కలుగజేసుకుని రాహుల్ కి ఆ మాట అర్థాన్ని వివరించారు. రాహుల్ తన తప్పు తెలుసుకుని వారి దురదృష్టంకొద్దీ తాను ఎంపీగా ఉన్నానని చెప్పారు. అయితే ముందు అన్న మాటనే బీజేపీ నేతలు హైలెట్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాహుల్ వ్యాఖ్యలపై వెటకారంగా స్పందించారు. ‘దురదృష్టవశాత్తు.. దీనిపై మాట్లాడటానికి మా దగ్గర పదాలు లేవు’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇది నిజంగానే దురదృష్టమంటూ మరో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ వీడియో లింక్ షేర్ చేశారు.
కాంగ్రెస్ రివర్స్ అటాక్...
అయితే రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ కవర్ చేసుకోవాలనుకోలేదు. రాహుల్ గాంధీ వెంటనే దానికి వివరణ ఇచ్చారని, అయినా కూడా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు జైరాం రమేష్. మళ్లీ బీజేపీ తన ఫేక్ న్యూస్ మెషిన్ కు పనిచెప్పిందని విమర్శించారు. రాహుల్ తన మాటలపై అప్పుడే స్పష్టత ఇచ్చారని, తాము టెలిప్రాంప్టర్లు లేకుండా మీడియాతో మాట్లాడతామని అన్నారు. అదానీ స్కాంను పక్కదారి పట్టించేందుకు ఇది మరో ప్రయత్నమంటూ మండిపడ్డారు జైరాం రమేష్.