సీజేఐ రమణపై వ్యాఖ్యలు.. చర్యలకు అటార్నీ జనరల్ నిరాకరణ

జస్టిస్ ఎన్‌వీ రమణను విమర్శిస్తూ ట్వీట్ చేసిన జర్నలిస్ట్ దిలీప్‌ మండల్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేందుకు కేంద్ర అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ నిరాకరించారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తికి కేకే వేణుగోపాల్ లేఖ రాశారు.

Advertisement
Update:2022-07-22 11:51 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణను విమర్శిస్తూ ట్వీట్ చేసిన జర్నలిస్ట్ దిలీప్‌ మండల్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేందుకు కేంద్ర అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ నిరాకరించారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తికి కేకే వేణుగోపాల్ లేఖ రాశారు.

నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలపై జస్టిస్ రమణ చేసిన ప్రసంగాన్ని విమర్శిస్తూ జర్నలిస్ట్ మండల్‌ ట్వీట్‌ చేశారు. '' అతడు చంద్రచూడ్‌ కంటే గొప్పగా ప్రసంగిస్తారు. ఈ పనికిమాలిన వ్యక్తులు చేయగలిగింది ప్రసంగాలు ఇవ్వడమే. సుప్రీంకోర్టులోనే 72 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో పిటిషనర్లు చనిపోతున్నారు కూడా. '' అంటూ జర్నలిస్ట్ దిలీప్‌ మండల్ విమర్శించారు. చాలా కేసుల్లో విచారణ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్న విధానాన్నిఅతడు విమర్శించారు.

ప్రధాన న్యాయమూర్తిని విమర్శిస్తూ చేసిన ట్వీట్ అనుచితంగా ఉన్నందున అతడిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న వినతి వచ్చింది. అయితే అందుకు అటార్నీ జనరల్ సమ్మతించలేదు. జర్నలిస్ట్ చేసిన ట్వీట్‌ న్యాయవ్యవస్థ ఖ్యాతిని దెబ్బతీసేలా ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. కోర్టు బాహువులు చాలా విశాలమైనవని సీజేకు రాసిన లేఖలో అటార్నీ వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్ చేసిన ట్వీట్‌ కోర్టును అపకీర్తిపాలు చేసేంత తీవ్రంగా గానీ, కోర్టు ఖ్యాతిని దెబ్బతీసేంత సామర్థ్యంతో ఉన్నాయని గానీ తాను భావించడం లేదని, అందుకే అతడిపై కోర్టు ధిక్కరణ చర్యలకు సమ్మతించడం లేదని సీజేఐకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ లేఖ రాశారు.

Tags:    
Advertisement

Similar News