ఎంకే స్టాలిన్ వర్సెస్ ఆర్‌ఎన్ రవి.. తమిళనాడు సీఎం వర్సెస్ గవర్నర్ మధ్య రచ్చ కొనసాగుతోంది. రాజ్ భవన్ తో సీఎంవోకు మొదటి నుంచి పొసగడం లేదు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు మరింత రచ్చకు దారితీశాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడు అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం సభ ప్రారంభంలో రాష్ట్రగీతం.. చివరలో జాతీయ గీతం ఆలపించడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్నే అసెంబ్లీలో పాటించారు. జాతీయ గీతం ఆలపిస్తే తప్ప తాను ప్రసంగాన్ని చదవబోనని గవర్నర్ తేల్చిచెప్పారు. ప్రసంగం చదవకుండా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమ ప్రభుత్వ ప్రగతిని చదవడానికి గవర్నర్ ఇష్టపడలేదని.. అతడి చర్య చిన్నపిల్లాడి మాదిరిగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి అంత అహంకారం మంచిది కాదని తమిళనాడు రాజ్ భవన్ ఇటీవల ట్వీట్ చేసింది.