సీజేఐ, షిండే ఒకే వేదికపైనా? ఇది ప్రమాదం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే భారత ప్రధాన న్యాయమూర్తితో కలిసి వేదిక పంచుకోవడం వివాదస్పదంగా మారింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే భారత ప్రధాన న్యాయమూర్తితో కలిసి వేదిక పంచుకోవడం వివాదస్పదంగా మారింది. కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించాయి. శివసేన తమదంటే తమదంటూ అటు ఉద్దవ్ ఇటు షిండే వర్గాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఈ కేసుల విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది.
ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనమే ఈ కేసును విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రకు చెందిన యూయూ లలిత్ సీజేఐ అయిన సందర్బంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీజేఐను షిండే సన్మానించారు. యూయూ లలిత్ సీజేఐ అయినందకు గర్వంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు.
ఈ ఫోటోను షేర్ చేసిన ఎన్‌సీపీ అగ్రనేత జయంత్ పాటిల్... ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వ చట్టబద్ధతనే సవాల్ చేస్తున్న ఒక తీవ్రమైన కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతున్న సమయంలోనే ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి వేదిక పంచుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ కూడా అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్న పిటిషన్ల ఆధారంగా షిండే ప్రభుత్వమే అనర్హతకు గురి కావచ్చని.. అలాంటి కేసు విచారణ సమయంలోనే ప్రధాన న్యాయమూర్తి లలిత్, సీఎం షిండే వేదిక పంచుకోవడం సరైన పద్దతి కాదని ట్వీట్ చేశారు.
ఇక శివసేన అధికార ప్రతినిధి అరవింద్ సావంత్.. ఈ కార్యక్రమంపై స్పందిస్తూ ప్రస్తుతం ఏది కూడా నియమ నిబంధనల ప్రకారం, చట్టం ప్రకారం జరగడం లేదన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తాము ఆందోళన వ్యక్తం చేయడానికి ఇదే కారణమని విమర్శించారు.