వివాదాస్పద వ్యక్తులు ఎవరని ప్రశ్నిస్తే.. మోడీ పేరు చెప్పిన చాట్ జీపీటీ

ప్రస్తుతం చాట్ జీపీటీ ఎన్నో రకాల విషయాలపై ఆన్సర్స్ ఇస్తోంది. అయితే, ఇది ఇచ్చే ఆన్సర్లపై కాస్త వివాదం కూడా నెలకొంటోంది.

Advertisement
Update:2023-02-20 14:16 IST

ఓపెన్ ఏఐ గతేడాది నవంబర్‌లో విడుదల చేసిన చాట్ జీపీటీ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. ఓపెన్ ఏఐకి చెందిన జీపీటీ-3 ప్లాట్ ఫామ్‌ మీద దీనిని రూపొందించారు. ముందుగానే ట్రైన్ చేసిన బాట్ కారణంగా మనం ఏ ప్రశ్నని అయినా చాట్ రూపంలో అడిగితే అది సమాధానం ఇస్తుంది. అందుకే దీని పేరులో జీపీటీ (జనరేటీవ్ ప్రీ ట్రెయిన్డ్ ట్రాన్స్‌ఫార్మర్) అని పొందు పరిచారు. ప్రస్తుతం చాట్ జీపీటీ ఎన్నో రకాల విషయాలపై ఆన్సర్స్ ఇస్తోంది. అయితే, ఇది ఇచ్చే ఆన్సర్లపై కాస్త వివాదం కూడా నెలకొంటోంది.

ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈవో చాట్ బోట్‌తో చిట్ చాట్ చేశారు. అప్పుడు ఇండియాలో పాపులర్ బ్రేక్ ఫాస్ట్ ఏంటని అడిగితే.. ఇడ్లి, వడ, దోసెతో పాటు బిర్యానీ అని కూడా చెప్పింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో బిర్యానీని బ్రేక్ ఫాస్ట్‌గా తిన్నా.. ఎక్కువ మంది దీన్ని లంచ్ లేదా డిన్నర్‌గానే తీసుకుంటారు తప్ప టిఫిన్‌గా తీసుకోరు. అందుకే సత్య నాదెళ్ల చాట్ జీపీటీ ఆన్సర్‌పై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై చాట్ జీపీటీ కూడా సత్య నాదెళ్లకు క్షమాపణలు చెప్పింది. తాజాగా ఐజాక్ లాటెరెల్ అనే వ్యక్తి చాట్ జీపీటీని పలు విషయాలు అడిగారు. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

ప్రపంచంలో వివాదాస్పద వ్యక్తులు ఎవరు అని ప్రశ్నించగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, నార్త్ కొరియా చీఫ్ కిమ్ పేర్లను పేర్కొన్నది. వివాదాస్పద వ్యక్తుల పేర్లలో నరేంద్ర మోడీ పేరు ఉండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే, చాట్ జీపీటీ వీరందరినీ వివాదాస్పద వ్యక్తులుగా పేర్కొన్నప్పటికీ.. వీళ్లను ప్రత్యేకంగా ట్రీట్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

ఇటీవల బీబీసీ కూడా రెండు ఎపిసోడ్ల డాక్యుమెంటరీని మోడీపై ప్రసారం చేసింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో అప్పటి గుజరాత్ సీఎం మోడీ ప్రమేయం ఉందనేలా అందులో పేర్కొన్నది. దీంతో ఆ డాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అంతే కాకుండా ఆ తర్వాత బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాట్ జీపీటీ కూడా మోడీని వివాదాస్పద వ్యక్తిగా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. కాగా, తనను వివాదాస్పద వ్యక్తిగా చాట్ జీపీటీ పేర్కొన్న విషయానికి సంబంధించిన ట్వీట్‌ను మస్క్ రీ ట్వీట్ చేశారు.


Tags:    
Advertisement

Similar News