ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌పై ఢిల్లీ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

చాట్ జీపీటీ ఇచ్చిన డేటా చట్టపరమైన తీర్పులకు ఆధారం కాబోదని వ్యాఖ్యానించింది. అది సేకరించిన డేటాలో కచ్చితత్వం లోపించే అవకాశం ఉందని, ఊహాజనితమైన సమాచారం కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement
Update:2023-08-28 08:17 IST

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ‌)పై ఢిల్లీ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. న్యాయవ్యవస్థ, తీర్పు ప్రక్రియలో మానవ మేధస్సును కృత్రిమ మేధ‌ భ‌ర్తీ చేయలేదని వ్యాఖ్యానించింది. కృత్రిమ మేధతో తయారైన ఏఐ అప్లికేషన్ చాట్ జీపీటీ సేకరించిన ఆధారాలను అనుసరించి న్యాయస్థానాల్లో చట్టపరమైన తీర్పులు ఇచ్చేందుకు తావులేదని పేర్కొంది. చాట్ జీపీటీ సేకరించిన ఆధారాలు ప్రాథమిక దర్యాప్తు కోసం ఉపయోగపడతాయని మాత్రం న్యాయ‌స్థానం అభిప్రాయపడింది.

త‌మ పార్ట్‌న‌ర్‌ సంస్థ త‌న ట్రేడ్‌మార్కును ఉల్లంఘించిందంటూ ప్ర‌ముఖ పాద‌ర‌క్ష‌ల ఉత్ప‌త్తి సంస్థ క్రిస్టియ‌న్ లాబౌటిన్ వేసిన ప‌రువు న‌ష్టం దావాపై చ‌ర్చ సంద‌ర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. ఇండియాలో `రెడ్ సోల్ షూ`కి త‌మ సంస్థ ట్రేడ్‌మార్క్ ఉంద‌ని, త‌మ బిజినెస్ పార్ట్‌న‌ర్‌గా ఉన్న సంస్థ దీనిని ప‌ట్టించుకోకుండా కాపీ కొట్టి.. సొంత ఉత్ప‌త్తుల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తోంద‌ని, దీనివల్ల తమ సంస్థ విశ్వసనీయత దెబ్బతింటోందని పేర్కొంటూ క్రిస్టియన్ లౌబౌటిన్ ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేసింది. చాట్‌ జీపీటీ ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని ఈ సంద‌ర్భంగా ఆ సంస్థ‌ పేర్కొంది.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం చాట్ జీపీటీ ఇచ్చిన డేటా చట్టపరమైన తీర్పులకు ఆధారం కాబోదని వ్యాఖ్యానించింది. అది సేకరించిన డేటాలో కచ్చితత్వం లోపించే అవకాశం ఉందని, ఊహాజనితమైన సమాచారం కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తాజా కేసులో ఇరు వర్గాల ఉత్పత్తులను పరిశీలించినట్లయితే ఉద్దేశ పూర్వకంగానే ప్రతివాది.. పిటిషన‌ర్ ఉత్పత్తులను కాపీ కొట్టారని, ఆ బ్రాండ్ పేరును వాడుకొని డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు తెలిపింది.

*

Tags:    
Advertisement

Similar News