పాక్ నౌకను ఛేజ్ చేసి.. భారత జాలర్లను రక్షించి!
2 గంటల పాటు వెంబడించి పాక్ ఓడ నుండి ఏడుగురు భారతీయ మత్స్యకారులను కాపాడిన ఇండియన్ కోస్ట్ గార్డ్
అరేబియా సముద్రంలో పాకిస్థాన్ అధికారుల చెర నుంచి ఏడుగురు భారత మత్స్యకారులను కోస్ట్‌గార్డ్ రక్షించింది. పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌకలో మత్స్యకారులను తరలిస్తుండగా.. ఛేజ్ చేసి అడ్డుకున్నది. 'నో ఫిషింగ్ జోన్' సమీపంలో మత్స్యకారుల నుంచి ఈ మేరకు సమాచారం అందడంతో హుటాహుటిన రంగంలోకి దిగి వారిని సురక్షితంగా విడిపించింది.
తమకు సాయం చేయాలని కోరుతూ భారత మత్స్యకారుల బోటు 'కాల భైరవ్' నుంచి ఐసీజీకి సమాచారం వచ్చింది. పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక తమను అడ్డుకున్నదని తెలిపింది. అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారులను పాక్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో.. వెంటనే భారత కోస్ట్ గార్డ్ బృందం రంగంలోకి దిగింది. భారత్-పాక్ మారిటైమ్ సరిహద్దుకు ఓ నౌకను వెంటనే పంపింది. పీఎంఎస్‌ఏ నౌక పాక్ వైపు వెళ్లేందుకు యత్నించనప్పటికీ.. ఐసీజీ నౌక వెంబడించి అడ్డుకున్నది. చివరకు పాక్ అధికారుల చెర నుంచి ఏడుగురు భారత మత్స్యకారులను విడిపించింది.
ప్రస్తుతం మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే జాలర్లకు చెందిన కాల భైరవ్ నౌక దెబ్బతిన్నదని, అనంతరం అది మునిగిపోయిందన్నారు. వీరంతా ఓఖా నౌకాశ్రయానికి చేరుకోగా.. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. పాకిస్థాన్-భారత్ నౌకల మధ్య ఘర్షణఖు దారి తీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు.