దేశవ్యాప్తంగా అమల్లోకి CAA.. ఏం జరగనుందంటే.?
ఈ చట్టం ప్రకారం.. ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం ఇవ్వనున్నారు. మొత్తం ఆరు మతాలకు చెందిన వారికి పౌరసత్వం లభించనుంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిటిజన్‌షిప్ అమెండమెంట్ యాక్ట్-2019 (CAA)ను అమల్లోకి తీసుకువస్తూ సర్క్యులర్ జారీ చేసింది. 2019 డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టం-CAA ఆమోదం పొందినప్పటికీ.. ఆ టైమ్‌లో అమల్లోకి తీసుకురాలేదు. దీనికి రాష్ట్రపతి కూడా ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత.. CAAను అమల్లోకి తీసుకువస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది కేంద్రం.
ఈ చట్టం ప్రకారం.. ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం ఇవ్వనున్నారు. మొత్తం ఆరు మతాలకు చెందిన వారికి పౌరసత్వం లభించనుంది. 2014 డిసెంబరు 31కి ముందు బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వలసవచ్చి ఇక్కడే స్థిరపడిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లకు పౌరసత్వం లభిస్తుంది. అయితే ముస్లింలను మినహాయించడం వివాదాస్పదంగా మారింది.
మరోవైపు సీఏఏ అమలుపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలోనే ఆరు రాష్ట్రాలు సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాయి. ప్రధానంగా కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తెలంగాణ అసెంబ్లీలు CAA అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయి.