సరోగసీ ద్వారా సంతానం పొందినవారికీ మాతృత్వ సెలవులు
సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఆమెకూ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇద్దరు సంతానం వరకే వీటిని పొందేందుకు అవకాశం ఉంటుంది.
సరోగసీ పద్ధతిలో సంతానం పొందిన ప్రభుత్వ ఉద్యోగినులకు కూడా ఆరు నెలల మాతృత్వ సెలవులు తీసుకునే వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనల్లో సవరణలు చేసింది. తద్వారా సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తల్లులకు వెసులుబాటు కల్పించినట్టయింది. అంతేకాదు.. ఆ బిడ్డ తండ్రి కూడా 15 రోజుల పితృత్వ సెలవులు తీసుకునే వీలు కల్పించింది.
ఒకవేళ సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఆమెకూ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇద్దరు సంతానం వరకే వీటిని పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయిన కమిషనింగ్ ఫాదర్ కూడా మొదటి ఆరు నెలల్లోగా 15 రోజుల పాటు పితృత్వ సెలవులు పొందడానికి కేంద్రం వీలు కల్పించింది. ఈ విధానం ద్వారా బిడ్డను పొందిన ప్రభుత్వ ఉద్యోగినికి ఇంతకాలం ఈ సదుపాయం అందుబాటులో లేదు.
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఉద్యోగిని, ఒంటరి ఉద్యోగి తన పూర్తి సర్వీసులో పిల్లల సంరక్షణ కోసం 730 రోజులు సెలవులుగా పొందుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 18న కేంద్రం కొత్త నిబంధనలను రూపొందించింది. సరోగసీ ద్వారా సంతానం పొందేందుకు చట్టబద్ధమైన వివాహం ద్వారా అయిదేళ్లు కలిసి ఉన్న దంపతులే అర్హులు. భార్యకు 23 – 50 ఏళ్ల లోపు వయసు, భర్తకు 26–55 ఏళ్ల వయసు ఉండి సాధారణ పద్ధతుల్లో సంతానం కలగని పరిస్థితుల్లో మాత్రమే ఆ దంపతులు సరోగసీ విధానంలో బిడ్డను పొందడానికి అవకాశముంటుంది.