ప్రజల నెత్తిన కేంద్రం మరో పిడుగు.. డిజిటల్ వాటర్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశాలు

తాగు, గృహ అవసరాల కోసం రోజుకు 25 క్యూబిక్ మీటర్ల లోపు భూగర్భ జలాలు వాడుకుంటే ఎలాంటి నీటి చార్జీలు వర్తించవు. కానీ అంతకు మించితే చార్జీలు వసూలు చేస్తారు.

Advertisement
Update:2023-04-01 08:51 IST

కేంద్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన మరో పిడుగు వేయబోతోంది. తాగునీటి, గృహ అవసరాలకు రోజుకు 20 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ భూగర్భ జలాలు ఉపయోగించే అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీల వద్ద తప్పని సరిగా డిజిటల్ వాటర్ ఫ్లో మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. 2020 సెప్టెంబర్‌ 24నే కేంద్రం డిజిటల్ వాటర్ ఫ్లో మీటర్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా దాన్ని సవరించి సరి కొత్త ఆదేశాలు ఇచ్చింది.

స్థానిక సంస్థలు సరఫరా చేసే నీటిని వాడుకోవడంతో పాటు భూగర్భజలాలను భారీగా తోడుకుంటున్నారనే కేంద్రం ఈ కొత్త మార్గదర్శకాలను వెలువరించింది. ఇకపై అపార్ట్‌మెంట్లు, సొసైటీలలో లేదా సొంతగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే తప్పకుండా ఎన్‌వోసీ తీసుకోవాలి. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్ ఉన్నా ఎన్ఓసీ తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజా ఆదేశాల్లో పేర్కొన్నది. మరో వైపు మోడల్ బిల్డింగ్ బైలాస్ ప్రకారం వాన నీటి సంరక్షణ కోసం ఎలాంటి ప్రణాళికలు చేశారో.. దానికి సంబంధించిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పరిశ్రమలు కూడా రాబోయే మూడేళ్ళలో 20 శాతం మేర భూగర్భ జలాల వినియోగం తగ్గించుకోవాలని చెబుతోంది.

బోరు బావుల ద్వారా ఉప్పు నీరు తోడుకొని వాడుతుంటే.. వాళ్లు తప్పనిసరిగా నీటి నాణ్యతను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ లేబొరేటరీస్ ద్వారా లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షలు చేయించాలి. ప్రమాణాల మేరకు నీటి నాణ్యత ఉంటేనే వాడుకోవాలని కూడా సూచించారు. వాణిజ్య సంస్థలు వాడుకునే గ్రౌండ్ వాటర్‌కు సంబంధించి ఆడిట్ సమర్పించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆ నీటిని ఏయే అవసరాలకు వాడుకుంటున్నారో కూడా తెలియజేయాలి.

సొంత బోరు నీటికి కూడా పన్ను..

తాగు, గృహ అవసరాల కోసం రోజుకు 25 క్యూబిక్ మీటర్ల లోపు భూగర్భ జలాలు వాడుకుంటే ఎలాంటి నీటి చార్జీలు వర్తించవు. కానీ అంతకు మించితే చార్జీలు వసూలు చేస్తారు. 25 నుంచి 200 క్యూబిక్ మీటర్ల లోపు.. ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రూ.1 రూపాయి, అంతకుమించితే రూ.2 చొప్పున వసూలు చేస్తారు. ఇక ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు భూగర్భ జలాలు వాడితే ప్రతీ ఘనపు మీటరుకు 50 పైసల చొప్పున చెల్లించాలి. అదే జరిగితే గ్రామపంచాయతీల్లో బోరు బావుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రాలకు భారం పడనున్నది. ఇన్నాళ్లూ ప్రభుత్వం సరఫరా చేసే నీటికే పన్ను వసూలు ఉండేది. ఇకపై సొంత బోరు నీళ్లు ఎక్కువ వాడినా చార్జీలు పడతాయి.

Tags:    
Advertisement

Similar News