లోక్‌సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

'ఒకే దేశం-ఒకే ఎన్నిక' బిల్లుపై లోక్‌సభలో కొనసాగుతున్న చర్చ

Advertisement
Update:2024-12-17 12:21 IST

కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ సభలో ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లుకు ఎన్డీఏ పక్షాలన్నీ మద్దతు పలుకగా.. బిల్లను విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు విపక్ష పార్టీలు ఎంపీలు దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ ఈ బిల్లుకు భేషరతుగా మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సభకు తెలియజేశారు. ఆ తర్వాత బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్‌ నిర్వహించారు.

జమిలి బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌ జరిగింది. హైబ్రిడ్‌ విధానంలో దీన్ని చేపట్టారు. ఇందులో కొంతమంది ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఓటు వేయగా.. మరికొంతమంది ఓంపీలు బ్యాలెంట్‌లో తమ అభిప్రాయాలను తెలియజేశారు. మొత్తంగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. 198 మంది వ్యతిరేకించారు. ఆ తర్వాత జమిలి బిల్లులను కేంద్ర మంత్రి సభలో ప్రవేశపెట్టారు. 

ఈ సందర్బంగా పార్టీ ఎంపీ మనీశ్‌ తివారీ మాట్లాడుతూ.. జమిలి బిల్లు రాజ్యంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమన్నారు. జమిలి బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగం ధ్వంసానికి బిడ్‌ వేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం టీెెెఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనన్నారు. జమిలి ఎన్నికలు ప్రజాస్వామానికి వైరస్‌ లాంటిది . ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు.. ఎన్నికల సంస్కరణలు అన్నారు. గతంలో ఎన్‌జేఏసీ (నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌) బిల్లను కూడా ఇలాగే చర్చ లేకుండా ఆమోదించుకున్నారు. ఆ తర్వాత మౌలిక స్వరూపానికి ఎన్‌జేఏసీ విరుద్ధమని సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. జమిలి ఎన్నికల చట్టం వస్తే దానికీ అదే పరిస్థితి ఎదురవుతుందని మండిపడ్డారు.

మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం అన్నారు. ఇది అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తాయి. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయన్నారు.ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపాలి. లేదా దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.శివసేన ఎంపీ ప్రతిపక్షాలు సంస్కరణలు అంటే అలర్జీ అని అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. జమిలి బిల్లుకు మేం పూర్తిగా మద్దతిస్తున్నామన్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. ఈ బిల్లును జేపీసీకి పంపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కేబినెట్‌ సమావేవంలో మోదీ స్వయంగా ఈ సూచన చేశారని తెలిపారు.న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదు. 1983 నుంచి ఈ తరణా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ ఉన్నది. దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకం కాదన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదన్నారు. స్వీడన్‌, జర్మనీ వంటి దేశాల్లోనూ జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ కోణంలోనే ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News